ట్రంప్ సంతకమే తరువాయి
వాషింగ్టన్ : అమెరికాలో సంచలనం రేపిన ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తునకు సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. కాంగ్రెస్‌లోని హౌజ్, సెనెట్ ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. దీంతో ఎప్‌స్టీన్ ఫైల్స్ బిల్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం కోసం శ్వేతసౌధానికి వెళ్లనున్నది. కాగా ఈ బిల్లు ప్రకారం న్యాయశాఖ 30 రోజుల్లోపే అన్ని ఫైళ్లనూ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే బాధితుల గోప్యత, నడుస్తున్న దర్యాప్తుల నడుమ అనవసరమైన విషయాలు మాత్రమే రహస్యంగా ఉంచే అవకాశాలున్నాయి.
దేశంలో తీవ్ర చర్చకు దారి తీసి, రాజకీయ దుమారాన్ని రేపిన ఈ ఫైల్స్‌ను బయటకు తీసుకురావడానికి ఇంతకాలం ట్రంప్ వ్యతిరేకించాడు. అయితే ఇటీవలే ఈ విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. సెనెట్ ఆమోదిస్తే బిల్లుపై సంతకం చేస్తానని చెప్పారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీలోనూ ఘర్షణ తలెత్తింది. కానీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలంటూ ఆయన పరిపాలనపై ఇంటా, బయటా ఒత్తిడి పెరిగింది. దీంతో డోనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఓటింగ్ కోసం ఆయన రిపబ్లికన్‌లకు పిలుపునిచ్చారు. దీనిపై మంగళవారం ఓటింగ్ జరిగింది.
రాజకీయాలు వద్దు.. బాధితులకు న్యాయం ముఖ్యం
ఎప్‌స్టీన్ ఫైళ్ల విషయంలో బాధితులు ఇప్పటికే తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దీనిని రాజకీయంగా మల్చొద్దనీ, ఇది మీ గురించి కాదని డోనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఓ బాధితురాలు చెప్పింది. ఎప్‌స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. ఆయనకు రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులతో ఉన్న సంబంధాలు ఇప్పటికీ అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.
హౌజ్‌లో భారీ మద్దతు
ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదలకు సంబంధించిన తీర్మానానికి యూఎస్ హౌజ్‌లో భారీ మెజారిటీ లభించింది. 427-1 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. లూసియానాకు చెందిన రిపబ్లికన్, ట్రంప్ మద్దతుదారుడు క్లే హిగ్గిన్స్ మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ వెనువెంటనే సెనెట్ కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరేన్సీ యాక్ట్‌ను ఆమోదించింది. ఉభయ సభల ఆమోదంతో బిల్లు ఇప్పుడు ట్రంప్ సంతకం కోసమే ఎదురు చూస్తున్నది. కాబట్టి ఈ బిల్లు శ్వేతసౌధానికి వెళ్తుంది.
బాధిత మహిళల నిరసన
ఎప్‌స్టీన్ చేత వేధింపులకు గురయ్యామని ఆరోపిస్తున్న మహిళల్లో కొందరు కాంగ్రెస్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో పారదర్శకతను కోరారు. తమ టీనేజ్ వయసులో తీసిన ఫొటోలను చేతిలో పట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ కేసు డోనాల్డ్ ట్రంప్‌నకు రాజకీయంగా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే.. ఆయన గతంలో ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని కలిగి ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ ఆ కథనాలను ఖండిచారు.



