Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రగతిని ప్రపంచానికి చూపడమే విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యం

ప్రగతిని ప్రపంచానికి చూపడమే విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యం

- Advertisement -

8,9 తేదీల్లో పండగలా గ్లోబల్‌ సమ్మిట్‌
ప్రముఖులు, సీఈవోలను ఆహ్వానిస్తాం
భవిష్యత్‌ తరాలకు మేలు చేకూర్చేలా రూపొందిస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల సీఈవోలను ఆహ్వానించి వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో పెద్ద పండగలా గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే విజన్‌ డాక్యుమెంట్‌-2047 లక్ష్యమని ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చేలా దాన్ని రూపొందిస్తామని వివరించారు. విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పన కోసం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమి లక్ష్య సాధన సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు క్యాబినెట్‌ కల అని అన్నారు.

ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములను చేసి సమగ్ర డాక్యుమెంట్‌ రూపొందించే బాధ్యతను రేవంత్‌రెడ్డి తనకు అప్పగించారని చెప్పారు. విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్‌బీతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల నుంచి నోడల్‌ అధికారులను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్‌బీ బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందన్నారు. పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్‌ డాక్యుమెంట్‌ను తుది దశకు తేవాలని అధికారులకు సూచించారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని అన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, వాటి అమలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని వివరించారు.

వచ్చేనెల తొమ్మిదితో ప్రజా ప్రభుత్వం రెండో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కాలంలో ఏం చేశామని చెప్పడం కంటే కూడా భవిష్యత్‌ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నామనేది కీలకమని అన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామనే విషయాలను వివరించనున్నట్టు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో జీడీపీని పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్‌ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించిందని వివరించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో మంచి వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఫార్మా, ఐటీ రంగాలకు దేశంలోనే కేంద్రంగా ఉందని చెప్పారు. ఇవన్నీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని అన్నారు. ఈ అంశాలన్నీ విజన్‌ డాక్యుమెంట్‌లో పకడ్బందీగా చోటు కల్పించాలని అధికారులకు సూచించారు.

నేడు విజన్‌ డాక్యుమెంట్‌ తుది దశకు తేవాలి
మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమి, 13 శాతం జీడీపీ లక్ష్యసాధనలో ప్రతి శాఖ ముఖ్యపాత్ర పోషించేలా జాగ్రత్తలు తీసుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. జీడీపీ 11 శాతం నుంచి 13 శాతానికి ఒకేసారి పెరగడం అంటే ఎంతో తీవ్రంగా ఆలోచించి అధికారులు బలమైన డాక్యుమెంట్‌ రూపొందించాలని సూచించారు. గురువారం శాఖల కార్యదర్శులు, మంత్రులతో చర్చించి విజన్‌ డాక్యుమెంట్‌ను తుది దశకు తేవాలని కోరారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్‌ డాక్యుమెంట్‌ను ఆమోదిస్తారని వివరించారు. అధికారులు వేగంగా డాక్యుమెంట్‌ రూపకల్పనను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సీఎస్‌ రామకృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌లు జయేష్‌ రంజన్‌, సంజయ్‌ కుమార్‌, వికాస్‌రాజ్‌, ఉన్నతాధికారులు శ్రీధర్‌, మహేష్‌ దత్‌ ఎక్కా, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నవీన్‌ మిట్టల్‌, హరీష్‌, జ్యోతి బుద్ధ ప్రకాష్‌, కృష్ణ భాస్కర్‌, ముషారఫ్‌ అలీ, నాగిరెడ్డి, చౌహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -