Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి

ఎన్‌కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి

- Advertisement -

– న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు స్వీకరించవు?
– నేడు మఖ్దూంభవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో రౌండ్‌ టేబుల్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వమే మావోయిస్టులను హత్యచేయించడంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్లను సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని కోర్టులను కోరారు. మావోయిస్టులను ఏకపక్షంగా చంపేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బుధవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. హిడ్మా లొంగిపోయే అవకాశాలున్న సమయంలో ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య చేయడమేంటని ప్రశ్నించారు. తాము కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టులు ప్రకటించాక కూడా వారిపై ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేయడమేంటని నిలదీశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్రహౌం మంత్రి అమిత్‌ ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. దేశంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. పేదల తరపున పోరాటం చేసే వారిని, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిని మోడీ సర్కారు చిత్రహింసలకు గురిచేస్తూ చంపేస్తున్నదని విమర్శించారు. పోలీసుల అదుపులో ఉన్నట్టు చెబుతున్న మావోయిస్టు నాయకులు తిరుపతితో పాటు అందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలనీ, చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులు హత్యలకు గురికావడంపై అందర్నీ కలుపుకుని న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. మనుషులను చంపినంత మాత్రానా, సిద్ధాంతాలను, భావాలను చంపడం సాధ్యం కాదనే విషయం మానవ చరిత్ర చెబుతుందని గుర్తుచేశారు. మావోయిస్టులు తమ కుటుంబాలను, జీవితాలను వదులుకుని అడవుల్లో జీవిస్తున్నారనీ, వారు ఏ సమస్యల పరిష్కారం కోసం అడవి బాట పట్టారో వాటి గురించి ఆలోచించాలని సూచించారు. మావోయిస్టులను చంపేస్తే అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజాల విషయంలో ఎవ్వరూ అడిగేవారు ఉండబోరని కేంద్రం భావిస్తోందన్నారు. బీజేపీని ప్రశ్నించే వారిని అర్బన్‌ నక్సలైట్లుగా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు. హిట్లర్‌ నమూనాగా పరిపాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు భయానకంగా శిక్షిస్తారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -