నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌నకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, తాజాగా రూ.1400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్‌గా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.9000 కోట్లకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్‌లలో ఉన్నట్లు సమాచారం. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీలలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కొంతకాలంగా విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే తాజా చర్యలు తీసుకున్నారు. ఇదే కేసులో గతంలో ఈడీ సుమారు రూ.7500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా మరో రూ.1400 కోట్ల ఆస్తులను జప్తు చేయడంతో దర్యాప్తు మరింత ముమ్మరమైనట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అక్రమ లావాదేవీలతో వాటికున్న సంబంధాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.



