ఒకవైపు 28 అంశాల శాంతి ప్రతిపాదన అని డోనాల్డ్ ట్రంప్ మరో అంకానికి తెరలేపాడు. మిగిలిన నాటో దేశాలు రష్యాను మరింతగా రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి. తమ జలాల్లో రష్యా గూఢచారి నౌక ఉందంటూ బ్రిటన్ చేస్తున్న ప్రచారం దానిలో భాగమే. ఇదే విధంగా కొన్ని తూర్పు ఐరోపా దేశాలు పక్కతాళం వేస్తున్నాయి. కొద్ది రోజులుగా రష్యన్ సేనల దాడులు పెరిగాయి. వాటితో పాటు వణికిస్తున్న చలి ముట్టడిలో ఉక్రెయిన్‌కు దిక్కుతోచటం లేదు. ట్రంప్ ప్రతిపాదించినట్లు చెబుతున్న నూతన శాంతి ప్రతిపాదనల గురించి తాము కూడా ”వినటం” తప్ప అంతకు మించేమీ తెలియదని మాస్కో ప్రతినిధులు చెబుతున్నారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న డాన్‌బాస్‌లో 88శాతం ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది. పన్నెండుశాతం ప్రాంతం మాత్రం ఉక్రెయిన్ ఆధీనంలో ఉంటుంది. అంతేగాక ఉక్రెయిన్ ఆయుధాలను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది.
అమెరికా ఆయుధ సరఫరాలను కూడా తగ్గిస్తారు. గతంలో వచ్చిన స్పందనలను బట్టి ఈ ప్రతిపాదనలకు అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ రెండూ అంగీకరించే అవకాశం లేదు. ట్రంప్ ప్రతిపాదనల గురించి తమకూ తెలియదని, చూస్తుంటే మాస్కోకు అనుకూలంగా ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ ఎంపీలు స్పందించారు. ‘ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిజానికి ట్రంప్ ప్రతిపాదనలు కొత్తవేమీ కాదు. వాటిని గతంలో ఐరోపా దేశాలు కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే, అయినప్పటికీ ట్రంప్ ఎందుకు ఇలాంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నట్లు? ఏ రూపంలో కూడా ఉక్రెయిన్ గడ్డ మీద విదేశీ దళాలను అంగీకరించే సమస్య లేదని గతంలోనే పుతిన్ స్పష్టం చేశాడు. ఇరవై ఎనిమిది అంశాలలో విదేశీ దళాలు ఉండవని, కాల్పుల విరమణ పర్యవేక్షణకు సైతం అవకాశం ఉండదని, భవిష్యత్‌లో పశ్చిమ దేశాల నుంచి దీర్ఘశ్రేణి క్షిపణులు అందుబాటులో ఉండవని, విదేశీ మిలిటరీలతో ఒప్పందాలు చేసుకోకూడదని ఇలాంటివే మరికొన్ని ప్రతిపాదనలు ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇవి పుతిన్‌కు వేస్తున్న బిస్కెట్లు తప్ప వేరు కాదు. ‘అడుసు తొక్కనేల కాలుకడగలేన’ అన్నట్లుగా అసలు సైనిక చర్య ప్రారంభం నుంచి రష్యా చేసిన డిమాండ్లను అంగీకరిస్తే గడచిన మూడు సంవత్సరాల తొమ్మిది నెలలుగా సాగుతున్న దాడులు జరిగేవి కాదు కదా! నాటోను విస్తరించి దానికి సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిటకు దళాలు, అణ్వాయుధాలను మోహరించాలని నిర్ణయించిన తరువాతే రష్యా గతంలో తన ప్రాంతమైన క్రిమియాలను 2014లో విలీనం చేసుకుంది. అప్పటి నుంచి ఉక్రెయిన్ కుట్రలకు నిలయంగా మారింది. చివరికి 2022 ఫిబ్రవరి చివరివారంలో రష్యా మిలిటరీ చర్యను ప్రారంభించింది. ‘సావిత్రీ..నీ పతి ప్రాణంబు దక్క వరం కోరుకో’మన్న యమధర్మరాజు మాదిరి నాటోను విస్తరించేది లేదు, ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వం అనే మాట పశ్చిమదేశాల నుంచి రావటం లేదు. అది జరగకుండా ఇతర ఎన్ని ప్రతిపాదనలు చేసినా రష్యా అంగీకరించే అవకాశాలు లేవు. ఉక్రెయిన్‌ను విచ్చిన్నం చేసి, కొని ప్రాంతాలను రష్యాకు శాశ్వతంగా అప్పగిస్తే నాటో కూటమిని, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాను ప్రపంచంలో మరొక దేశం ఏదైనా నమ్ముతుందా? దానికి అమెరికా సిద్ధపడే ప్రశ్నే లేదు గనుక ట్రంప్ కడుపులో ఏదో దుష్టాలోచన ఉన్నందునే కొత్త ప్రతిపాదనలని చెప్పవచ్చు.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే రష్యాను నిలువరించే అవకాశాలు లేవని ఇప్పటికే పశ్చిమదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.అందుకే పరిణామాలను మరోదారి మళ్లించేందుకు సరికొత్త కుట్రలకు పూనుకున్నాయి. గత కొద్ది నెలలుగా రష్యన్ డ్రోన్లు, విమానాలు తూర్పు ఐరోపాలోని నాటో దేశాల గగనతలాన్ని అతిక్రమిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటున్నదన్న గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకున్నాయి. ఆ పేరుతో నాటో జోక్యం చేసుకొని రష్యా మీద దాడి చేసే అవకాశం ఉందా అంటే ఇప్పటికైతే అలాంటి అవకాశం లేదు. అమెరికా మినహా ఐరోపాలోని అన్ని నాటో దేశాల్లో ఉన్న మిలిటరీ ఒక ఎత్తయితే రష్యన్ బలం మరొక ఎత్తు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న ఐరోపా దేశమేదీ యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. ఏదో ఒక ప్రయోజనం కలుగుతుందన్న హామీ ఉంటేనే సామ్రాజ్యవాదులు యుద్ధానికి దిగుతారు తప్ప మరొకటి కాదని చరిత్ర చెప్పిన సత్యం. యుద్ధాలతో దేశాలను, మార్కెట్లను ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మరొక ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ సంక్షోభం అమెరికా సృష్టి. దాన్నుంచి బయటపడాల్సింది కూడా అదే, ఎలా అన్నది చూద్దాం!
రెచ్చగొడుతున్న పశ్చిమదేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



