భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. పారిస్ ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ఎట్టకేలకు సత్తా చాటింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో చైనీస్‌తైపీ బాక్సర్ షుయాన్‌పై నిఖత్ జరీన్ 5-0తో ఏకపక్ష విజయం సాధించింది. ఎలైట్ మహిళల 51 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది.
5-0తో ఫైనల్లో ఏకపక్ష విజయం
మీనాక్షి, ప్రీతి, అరుంధతి, నుపుర్‌లకు స్వర్ణం
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025
నవతెలంగాణ-నోయిడా
2024 పారిస్ ఒలింపిక్స్. బాక్సింగ్‌లో పసిడి పతక ఫేవరేట్ నిఖత్ జరీన్. కానీ, పారిస్‌లో తెలంగాణ స్టార్ పసిడి వేట రౌండ్-16లోనే అర్థాంతరంగా ముగిసింది. నిఖత్‌పై నెగ్గిన చైనా బాక్సర్.. ఆ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. 2025 వరల్డ్ బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్. లివర్‌పూల్‌లోనూ నిఖత్ జరీన్ భారత బృందంలో పసిడి ఫేవరేట్. కానీ అక్కడా బాక్సింగ్ సూపర్‌స్టార్‌కు అనూహ్య నిరాశే ఎదురైంది. ఆకాశన్నంటే అంచనాలతో బరిలోకి పతకం లేకుండా నిష్క్రమించిన నిఖత్ జరీన్.. రెండు నెలలుగా కఠోర సాధన చేసింది. టెక్నికల్‌గా ఎంతో మెరుగైన నిఖత్ జరీన్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో పూర్వ వైభవం చాటింది. ప్రతి బౌట్‌లోనూ, ప్రతి రౌండ్‌లో ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది.
పదునైన పంచ్‌లు, ప్రత్యర్థిని మాయ చేస్తూ మెరుపు వేగంతో జాబ్స్ సంధించిన నిఖత్ జరీన్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో బంగారు పతకం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ ఈ విజయంతో మళ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ఎలైట్ మహిళల 51 కేజీల విభాగం పసిడి పోరులో చైనీస్ తైపీ బాక్సర్ షుయాన్‌పై నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించింది. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను మూడు రౌండ్లలో స్పష్టమైన విజేతగా నిర్ణయించారు. 30-27, 30-27, 30-27తో వరుసగా మూడు రౌండ్లలో నిఖత్ జరీన్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో భారత బాక్సర్లు పసిడి పంచ్‌తో మెరిశారు. ఎలైట్ మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో ప్రతీ 5-0తో ఇటలీ బాక్సర్ సైరైనెపై గెలుపొందింది. 48 కేజీల విభాగం పసిడి పోరులో మీనాక్షి 5-0తో ఆసియా చాంపియన్ ఫర్జోనాపై స్పష్టమైన విజయం నమోదు చేసింది. 70 కేజీల విభాగం ఫైనల్లో అరుంధతి చౌదరి 5-0తో ఉబ్జెకిస్తాన్ బాక్సర్ అజిజాపై గెలుపొంది పసిడి పతకం సాధించింది. పురుషుల విభాగంలో భారత్ నాలుగు రజత పతకాలు సాధించింది. మెన్స్ 50 కేజీల విభాగం ఫైనల్లో జాడుమని సింగ్ 1-4తో పోరాడి ఓడాడు. 55 కేజీల విభాగం ఫైనల్లో పవన్ బర్టావల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. 65 కేజీల విభాగం ఫైనల్లో అభినాశ్ జమ్వాల్ 1-4తో జపాన్ బాక్సర్ చేతిలో ఓటమి చెందాడు. 80 కేజీల విభాగంలో ఇంగ్లాండ్ బాక్సర్‌తో పోరాడి ఓడిన అంకుశ్ పంగాల్ సిల్వర్ మెడల్ సాధించాడు.



