Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు

భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు

- Advertisement -

ట్రంప్‌ సర్కార్‌ పచ్చజెండా
జావెలిన్‌ క్షిపణులు సహా పలు ఆయుధాల విక్రయానికి ఆమోదం

న్యూయార్క్‌ : భారత్‌కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌జీఎం -148 జావెలిన్‌ యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌తో పాటు ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్‌, వాటి అనుబంధ సామగ్రిని భారత్‌కు అగ్రరాజ్యం విక్రయించనుంది. దాదాపు రూ.824 కోట్ల (93 మిలియన్‌ డాలర్లు) విలువైన ఈ భారీ డీల్‌కు డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ పచ్చజెండా ఊపింది. దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారత్‌కు అందించనున్న ఆయుధ సామగ్రి జాబితాలో 100 జావెలిన్‌ మిస్సైళ్లు, 1 ఫ్లైటు బై రౌండ్‌, 25 కమాండ్‌ లాంచ్‌ యూనిట్లు, ట్రైనింగ్‌ ఎయిడ్‌లు, సిమ్యులేషన్‌ రౌండ్లు, ఆయుధ సామగ్రితో ముడిపడిన విడి భాగాలు ఉన్నాయని డీఎస్‌సీఏ తెలిపింది. రూ.417 కోట్ల విలువైన 216 యూనిట్ల ‘ఎం982ఏ1 ప్రొజెక్టైల్స్‌’ను, రూ.405 కోట్ల విలువైన 126 యూనిట్ల జావెలిన్‌ మిస్సైల్‌ సిస్టమ్‌లను భారత్‌కు విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఈ మొత్తం సామగ్రికి అమెరికా సైన్యం వైపు నుంచి పూర్తిస్థాయి జీవితకాల మద్దతు లభిస్తుందని వెల్లడించింది. ఈ ప్రతిపాదిత లావాదేవీకి అవసరమైన సర్టిఫికేషన్‌ను అమెరికా కాంగ్రెస్‌కు డీఎస్‌సీఏ అందజేసింది.

ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాల్లో సుస్థిరతే లక్ష్యం
”అమెరికా-భారత్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ప్రధాన రక్షణరంగ భాగస్వామి అయిన భారత్‌ భద్రతను మెరుగుపర్చేందుకు ఈ ఆయుధ సామగ్రిని విక్రయిస్తున్నాం. ఈ విక్రయ డీల్‌ అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతును అందిస్తుంది. దీనివల్ల ఇండో-పసిఫిక్‌, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో సైనికపరమైన సమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఈ ఆయుధ సామగ్రి ప్రస్తుత, భవిష్యత్‌ ముప్పులను అత్యంత కచ్చితత్వంతో ఎదుర్కొనేలా భారత్‌కు ఉపయోగపడుతుంది. కచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం భారత్‌కు లభిస్తుంది. ఈ సామగ్రిని భారత సైన్యం సమర్థవంతంగా వినియోగించగలదు” అని డీఎస్‌సీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే అమెరికా మెప్పుకోసమే మోడీ భారీగా రక్షణ ఆయుధాలను కొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -