Saturday, May 17, 2025
Homeజాతీయంజమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు

- Advertisement -

– ఆరుగురు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్‌:
జమ్మూకాశ్మీర్‌లో గత మూడు రోజుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లల్లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కాశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజిపి) వికె బిర్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో విక్టర్‌ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయంలో విక్టర్‌ ఫోర్స్‌ కమాండింగ్‌ జనరల్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ ధనంజరు జోషితో కలిసి ఐజిపి విలేకరులతో మాట్లాడారు. భద్రతా సంస్థల మధ్య సమన్వయం కారణంగా రెండు విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. మంగళవారం షోపియన్‌ జిల్లాలోని కెల్లర్‌ ప్రాంతంలోనూ, గురువారం పుల్వామాలోని త్రాల్‌లోని నాదర్‌ ప్రాంతంలోనూ ఈ రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలిపారు. రెండు ఆపరేషన్లలోనూ ముగ్గురేసి చొప్పున ఉగ్రవాదులు మరణించారని చెప్పారు.జమ్మూకాశ్మీర్‌ పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) సమన్వయంతో ఆ ఆపరేషన్లు నిర్వహించినట్లు వి.కె.బిర్డి తెలిపారు. కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈప్రాంతంలో మోహరించిన అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించాయని అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మేజర్‌ జనరల్‌ జోషి పేర్కొన్నారు. మంచు కరగడం వల్ల ఉగ్రవాదలు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లారని తమకు నిఘా సమాచారం అందిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ బృందాలు నిరంతరం ఎత్తైన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, అడవుల్లో మోహరించాయని జోషి తెలిపారు. మృతి చెందిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ప్రధాన వ్యక్తి షాహిద్‌ కుట్టారు అని, ఇతను కొన్ని భారీ దాడుల్లో పాల్గొన్నాడని చెప్పారు. ఇందులో ఒక సర్పంచ్‌పై దాడి, ఒక డానిష్‌ రిసార్ట్‌లో కాల్పుల సంఘటన వంటివి ఉన్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -