అఫిడవిట్ దాఖలు చేయాలి : స్పీకర్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబందించి అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ శాసనసభ్యులు కడియంశ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారంటూ అరోపణులు ఎందుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతున్నది. దానం నాగేందర్, కడియంశ్రీహరి మాత్రం మరింత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. గురువారం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుండటంతో మిగతా ఇద్దరికీ స్పీకర్ ఇంకోసారి నోటీసులు ఇచ్చారు. తన నోటీసులకు స్పందించి వెంటనే అఫిడవిట్ సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయసలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత స్పీకర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు అసెంబ్లీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నాలుగు వారాల్లో ఈకేసుల్లో నిర్ణయం ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ విచారణను వేగవంతం చేయడం గమనార్హం.
న్యాయవాదుల వాదనలు
ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడీ గాంధీ తరపున వారి న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై గురువారం వాదనలు వినిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు విచారణ కొనసాగింది. తమ క్లయింట్లు నియోజవవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను కలిశారు తప్ప, పార్టీ మారడం కోసం కాదన్నారు.



