– 500 బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభలు గత సంవత్సరం సగటున 20 రోజుల 100 గంటలు మాత్రమే పనిచేశాయి. ఆ కాలంలో 17 బిల్లులను ఆమోదించాయి. వీటిలో 51 శాతం బిల్లులు ప్రవేశపెట్టిన ఒక రోజు వ్యవధిలోనే ఆమోదం పొందాయి. పీఆర్‌ఎస్ లెజిస్లేచివ్ రిసెర్చ్ సంస్థ అధ్యయనం ఈ విషయాలను తెలియజేసింది. ఒడిశా శాసనసభ 42 రోజులు, కేరళ శాసనసభ 37 రోజులు, పశ్చిమ బెంగాల్ శాసనసభ 36 రోజులు పనిచేసి కొంత మెరుగనిపించాయి. కర్నాటక శాసనసభ ఏడాదికి 60 రోజులు సమావేశం కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ కేవలం 29 సిట్టింగ్స్ మాత్రమే జరిగాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఏడాదికి 90 సిట్టింగ్స్ జరపాలని అనుకుంటే కేవలం 16 సమావేశాలతోనే సరిపెట్టింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ కూడా 16 రోజులే సమావేశమైంది. మణిపూర్‌లో 14, జమ్మూకాశ్మీర్‌లో 5, నాగాలాండ్‌లో 6, సిక్కింలో 8 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల స్వల్పకాలిక సిట్టింగ్స్‌తో కలిపి 11 రాష్ట్రాలలో ఈ నియమాన్ని పాటించారు. 2017 నుంచి ఏడాదికి సగటున 30 రోజుల కంటే తక్కువగా సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో 28 సిట్టింగ్స్ జరిగాయి. 2020లో కోవిడ్ కారణంగా ఆ సంఖ్య 16కు పడిపోయింది. అప్పటి నుంచి సగటున ఏడాదికి సుమారు 20 రోజుల పాటే సమావేశాలు జరిగాయి. 2018లో సగటున 26 సిట్టింగ్స్, 2019లో 24 సిట్టింగ్స్, 2021, 2022లో 21 సిట్టింగ్స్ చొప్పున, 2023లో 22 సిట్టింగ్స్ జరగగా గత సంవత్సరం ఆ సంఖ్య 20కి తగ్గిపోయింది.
కొన్ని రాష్ట్రాలు శాసనం ద్వారా లేదా నిబంధనలను రూపొందించుకోవడం ద్వారా కనీస వార్షిక సిట్టింగ్స్‌ను నిర్దేశించుకున్నప్పటికీ 2017-2024 మధ్య వాటిలో ఏ రాష్ట్రమూ లక్ష్యాన్ని చేరలేదని నివేదిక వేలెత్తి చూపింది. గత సంవత్సరం శాసనసభలు సగటున 100 గంటలు సమావేశమయ్యాయి. కేరళ అత్యధికంగా 228 గంటల పాటు సమావేశం నిర్వహించగా ఒడిశా (193 గంటలు), మహారాష్ట్ర, రాజస్థాన్ (187 చొప్పున), గోవా (172), ఛత్తీస్‌గఢ్ (155), తెలంగాణ (149), కర్నాటక (145 గంటలు) తర్వాతి స్థానాలలో నిలిచాయి.
బిల్లులకు సంబంధించి సగటున ప్రతి శాసనసభ 17 బిల్లులను ఆమోదించింది. గత సంవత్సరం మొత్తం మీద 500 బిల్లులు ఆమోదం పొందాయి. 49 బిల్లులతో కర్నాటక మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు (45), హిమాచల్ ప్రదేశ్ (32), మహారాష్ట్ర (32) తర్వాతి స్థానాలలో నిలిచాయి. ఢిల్లీ శాసనసభ కేవలం ఒకే బిల్లును ఆమోదించగా రాజస్థాన్ అసెంబ్లీ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది.
దేశంలో శాసనసభల పని వేళలు సగటున 20 రోజులే
- Advertisement -
- Advertisement -