ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్
కృత్రిమ మేథ ముప్పులపై ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలి
జెనీవా : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భద్రత విషయంలో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పని చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సూచించారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి, దాని వల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని టెక్నాలజీ రంగానికి చెందిన నిపుణులు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను విస్మరించలేమని అన్నారు. ఏఐ ముప్పు నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
వార్షిక సమావేశంలో జరిపే చర్చలో ఏఐ ప్రధానాంశం
ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ సహా ప్రముఖ టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు ఇటీవల చేసిన ప్రతిపాదనను ఐరాస చీఫ్ ఆంటోనియో ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక అభివృద్ధి, విద్యా రంగం, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి వాటిల్లో ఏఐకి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. కానీ అదుపు తప్పిన కృత్రిమ మేధస్సు వల్ల కలిగే మానవ అస్తిత్వ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశం కోసం జరిగే వార్షిక సమావేశంలో ప్రపంచ నాయకులతో తాను జరిపే చర్చలలో ఏఐ ఒక ప్రధాన అంశంగా ఉంటుందని ఆయన తెలిపారు.
‘అంతర్జాతీయ సహకారం గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరం’
ఏఐ విషయంలో చైనా, అమెరికాల మధ్య ఉన్న పోటీని ఐరాస చీఫ్ గుటెరస్ పరోక్షంగా ప్రస్తావించారు. ఏఐ అభివృద్ధిలో భౌగోళిక రాజకీయ విభజన తీవ్ర ప్రమాదాలను సృష్టించగలదని హెచ్చరించారు. అధునాతన ఏఐ సామర్థ్యాలు కలిగిన దేశాల మధ్య మరింత చర్చలు, సమాచార మార్పిడి, ఉమ్మడి రక్షణ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సహకారం గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఐరాస సహా ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని ఆయన అంగీకరించారు. శాంతిని కాపాడటం, మానవ హక్కులను పరిరక్షించడం వంటి ఐక్యరాజ్యసమితి వాగ్దానాలు మారవని స్పష్టం చేశారు.



