Friday, September 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాపై ఆంక్షల బిల్లుకు 
అమెరికా ఆమోదం

రష్యాపై ఆంక్షల బిల్లుకు 
అమెరికా ఆమోదం

- Advertisement -

భారత్‌కు 100 శాతం టారిఫ్ ముప్పు
రూ.1.20 లక్షల కోట్ల ఆదాకు గండి?
ఎగుమతులకూ 
భారీ దెబ్బ

వాషింగ్టన్‌ : రష్యా నుంచి భారీ రాయితీ ధరలకు పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు అమెరికా నుంచి పెద్ద షాక్ తగిలేలా ఉంది. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు వీలు కల్పించే వివాదాస్పద బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ (యూఎస్ హౌస్) ఆమో దం తెలిపింది. ఈ పరిణామం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు మీదుగా రూపొందించిన ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026’ బిల్లు ద్వారా రష్యా ఆదాయ వనరులను పూర్తిగా దెబ్బతీయడమే దీని లక్ష్యం. ఇందులోని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడికి అసాధారణ అధికారాలు కల్పిస్తూ.. రష్యా ఇంధనం, సైనిక పరికరాలను దిగుమతి చేసుకునే లేదా ఆంక్షల ఉల్లంఘనకు సహకరించే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం కల్పించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా కాంగ్రెస్ ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా ముడిచమురు ఎగుమతు లపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు, రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు వడ్డించే విశేష అధికారాలను ఈ బిల్లు ద్వారా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు కల్పించారు. ప్రతిని ధుల సభలో బుధవారం ఆమోదం పొందిన ఈ చట్టం.. అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు చేరింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యాపై అమెరికా తీసుకున్న అత్యంత కీలక వ్యతిరేక చర్య ఇదే కావడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు 20 మందికి పైగా ఉన్నత అధికారులు, రక్షణ పరిశ్రమ సంస్థలపై ఈ బిల్లు కొత్త ఆంక్షలను ప్రతిపాదిస్తోంది. అంతే కాకుండా రష్యా ఇంధన ఎగుమతులను కొనసా గిస్తున్న షాడో ట్యాంకర్ల నౌకాదళాన్ని, ఆంక్షల నుంచి తప్పించుకునే నెట్‌వర్క్‌ను ఇది ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది.

భారత్‌‌కు తీవ్ర నష్టమే..!
రష్యా నుంచి అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, భారత్‌లపై ఈ కొత్త చట్టం తీవ్ర ప్రభావం చూపనుంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఆగస్టు గణాంకాల ప్రకారం.. రష్యా ముడిచమురు ఎగుమతుల్లో సుమారు సగం చైనా దిగుమతి చేసుకోగా, భారత్ 37 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. టర్కీ, ఐరోపా సంయుక్తంగా చెరో 5 శాతం దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్‌కు ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం 134.7 బిలియన్ డాలర్ల విలువైన చమురులో రష్యా వాటా ఏకంగా 30.3 శాతం లేదా 40.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ చౌక చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఇప్పటివరకు దాదాపు 12.6 బిలియన్ డాలర్ల (రూ.1.20 లక్షల కోట్లు)ను ఆదా చేసుకున్నట్లు అంచనా. ట్రంప్‌ ఆంక్షలు అమల్లోకి వస్తే భారత్‌‌కు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది.

ఉన్నత స్థాయిలో చర్చించాము : కేంద్రం
యూఎస్‌ ‌బిల్లు పరిణామాలపై భారత్ తన వైఖరిని వెల్లడించింది. తమ 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నామని, మార్కె ట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ వనరుల నుంచి దిగుమతులు కొనసాగిస్తామని విదే శాంగ శాఖ తెలిపింది. అమెరికా ప్రతినిధులతో ఈ అంశాన్ని ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చిం చామ ని.. ఈ బిల్లు కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరత్వా నికి కూడా విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

వ్యతిరేకించిన చైనా..
అమెరికా చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఏకపక్షంగా విధించే ఆంక్షలను తాము అంగీకరిం చబోమని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే మెుత్తం సముద్ర మార్గంపైనే ఆధారపడే భారత్ లాగా కాకుండా.. చైనాకు సైబీరియా-పసిఫిక్ పైప్‌లైన్ ద్వారా నేరుగా భూమార్గం గుండా రష్యా చమురు సరఫరా కావడం ఆ దేశానికి కొంత వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం, సౌదీ అరేబియా పైప్‌లైన్‌లపై దాడులు జరగడం వల్ల ప్రపంచ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ తరుణంలో అమెరికా కఠిన టారిఫ్‌ల వల్ల భారత్, చైనా వంటి దేశాలు రష్యా చమురును నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్‌లో ఇతర ఆయిల్ బారెల్స్ కోసం పోటీ పెరిగి ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు కేవలం రష్యా చమురుపైనే కాకుండా అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా మార్కెట్‌కు భారత్ ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, టెక్స్‌టైల్స్, పెట్రోలియం ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేస్తోంది.

కేవలం 2025లోనే అమెరికా భారత్ నుంచి దాదాపు 104 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు 100 శాతం టారిఫ్ కత్తి వేలాడుతుండటంతో భారతీయ ఎగుమతిదారులు, రూపాయి మారకం విలువ, రిఫైనరీ మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సున్నితమైన ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ బిల్లును తీసుకురావడం భారత్‌కు అత్యంత ప్రమాదకరమని అట్లాంటిక్ కౌన్సిల్ సీనియర్ ఫెలో మైఖేల్ కుగెల్మాన్ పేర్కొన్నారు. చైనా తన ఆర్థిక ఆధిపత్యం, గ్లోబల్ సప్లయి చెయిన్‌‌లపై పట్టు కారణంగా అమెరికాతో బేరసారాలు ఆడగలదని.. కానీ భారత్‌కు ఆ స్థాయి పరపతి లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశముందని విశ్లేషించారు. రష్యా చమురుపై ఆంక్షల పేరుతో భారత్‌ను ఏకపక్ష వాణిజ్య ఒప్పందాలకు లొంగదీసుకునేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -