దోపిడీపై సాగిన వర్గ పోరాటానికి బీజేపీ మతం రంగు
10 లక్షల ఎకరాలు పంచిన కమ్యూనిస్టులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ట్యాంక్‌బండ్ నుంచి ఎస్వీకే వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు బైక్ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాం నిరంకుశత్వం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, హైదరాబాద్ సంస్థాన విలీన ఘట్టం చర్రితను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. వర్గ పోరాటానికి మతం రంగు పూసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న మగ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం నుంచి కవాడిగూడ, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వీఎస్టీ చౌరస్తా మీదుగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. నిజాం ప్రభుత్వాన్ని గడగడలా డించి బలహీనపరిచింది ప్రజలు, కమ్యూనిస్టులేనని తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోగానీ, తెలంగాణ సాయుధ పోరాటంలోగానీ ఆర్‌ఎస్‌ఎస్ లేదా నాటి జనసంఘ్‌లకు ఎలాంటి పాత్రా లేదని, అలాంటి బీజేపీకి ఈ చరిత్రపై మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. శ్రీనివాసరావు, ఎం. మహేందర్, ఎం. దశరథ్, కేఎన్ రాజన్న నాయకత్వం వహించగా.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



