నాటి సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తిదాయకం : రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
గూడూరులో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం, రైతు సంఘం జాతీయ మహాసభ విరాళాల సేకరణ
నవతెలంగాణ- మిర్యాలగూడటౌన్
భూమి కోసం, భక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం నాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆదర్శనీయమని, ఆ స్ఫూర్తితో నేటి నయా జమీందారులకు వ్యతిరేకంగా పోరాడటమే ముందున్న కర్తవ్యమని అఖిల భారత కిసాన్ సభప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో బుధవారం వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవంతోపాటు ఏఐకేఎస్ జాతీయ మహాసభ జయప్రదం కోసం విరాళాల సేకరణ నిర్వహించారు. అంతకుముందు అమరవీరుల స్థూపాలకు విజ్జూ కృష్ణన్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ మహిళ సైతం జమీందారు గూండాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడే విధంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తయారు చేసిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో వారికి గులాములుగా జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూర్ రామచంద్రారెడ్డి లాంటి దుర్మార్గులు ఉండేవారని చెప్పారు. వారి ఆగడాలకు వ్యతిరేకంగా తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, వీరోచితంగా పోరాడారని తెలిపారు.
సాయుధ పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 4వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేశారని వివరించారు. తద్వారా దేశవ్యాప్తంగా భూసంస్కరణలు, భూదాన ఉద్యమానికి పాలకులు పూనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నయా జమీందారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పూనుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న రైతు సంఘం అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, టాప్రా జిల్లా అధ్యక్షులు నూకల జగదీశ్ చంద్ర, గూడూరు సర్పంచ్ బొగ్గారపు కృష్ణయ్య, ఐద్వా నాయకులు వరలక్ష్మి, గోవర్ధన, అరుణ, కౌసల్య పాల్గొన్నారు.



