రూ. లక్ష కోట్ల విలువైన భూమిని దోచారు
ఆయన కుటుంబ ఆధీనంలో 440 ఎకరాలు
విదేశీ ముఠాకు ధరణి పోర్టల్ ఇచ్చారు
నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
30 రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వాలి
సత్యం రామలింగరాజు భూమి కేటీఆర్‌కు ఎలా బదిలీ అయ్యింది?
రంగనాయక సాగర్‌లో హరీశ్‌రావు ఫామ్‌హౌస్ అక్రమమే
మైహోం కంపెనీకి 2,300 ఎకరాలు ఎలా ఇచ్చారు?
22-Aలో 98,37,320 ఎకరాలు ఉండాల్సిందే
లేకుంటే వాటికి రక్షణ ఉండదు : శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రూ. లక్ష కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ, ఫారెస్టు, అసైన్డ్, ఇనాం, వివాదాల్లోని భూములు…. ఇలా కల్వకుంట్ల కుటుంబం వేటినీ వదిలిపెట్టలేదన్నారు. బుధవారం శాసనసభలో 22-ఏపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భూ రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను ఉల్లంఘించి, భూములను కొల్లాగొట్టారని చెప్పారు. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబం 440 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. అంత భూమి ఎలా వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. చట్టాలను విధ్వంసం చేసి, పేదల భూములను లాక్కున్నారని చెప్పారు. ఈ వ్యవహరంపై ప్రత్యేక విచారణ బృందం(ఎస్‌ఈటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ బృందం కేసీఆర్ కుటుంబంతో పాటు ధరణి అక్రమాలపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూములపై కోర్టు కేసులు, వివాదాలతో కొంత ఆలస్యమైనా కేసీఆర్ భూదోపిడీని నిగ్గుతేలుస్తామన్నారు.
భూ దోపిడీకి పాల్పడిన ఆ కుటుంబం జైలుకుపోక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ బినామీ బోయినపల్లి శ్రీనివాసరావు వట్టినాగులపల్లిలో ప్రభుత్వ భూమికి సేల్ డీడ్ చేసినట్టు బహిర్గతమైందని చెప్పారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ ఫిరాయించినందుకు ఆయన పేరిట 106 ఎకరాల ఫారెస్ట్ భూమిని పట్టాగా మార్చారని తెలిపారు. అటవీ శాఖ అధికారులు కోర్టుకు పోతే ఆ భూమి ప్రయివేటు భూమి అంటూ కలెక్టర్ నివేదించారంటే, కేసీఆర్ కుటుంబం ఏ రకంగా భూ విధ్వంసానికి పాల్పడిందో అర్థమవుతోందన్నారు. బహుదూర్‌గూడలో 77 ఎకరాల భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి లేఖ రాయాలని సూచించారు. ఓ పత్రిక ఎమ్‌డీకి బెంజ్‌కార్లు ఎలా వచ్చాయో, అందుకు ప్రతిఫలంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ధరణి అడ్డం పెట్టుకుని… భూదాన్ భూముల పట్టా
ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని భూదాన్ భూములకు ఇబ్బడి ముబ్బడిగా పట్టాలు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. సిరిసిల్లలో ఎనిమిదివేల ఎకరాల అసైన్డ్ భూములు బదలాయించారని తెలిపారు. సందీప్ ఝాను కలెక్టర్‌గా వేస్తే రెండువేల ఎకరాలను బయటకు తీశారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు చుట్టు పక్కల మైహోం రామేశ్వర రావుకు 2,647 ఎకరాల భూమి కట్టబెట్టారన్నారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళ్ల చెరువులో ధరణి ద్వారా భూదాన భూమికి పట్టా ఇచ్చారని ఆధారాలను బహిర్గతం చేశారు.
మైహోం కంపెనీకి 113 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ కి వాడుకుంటున్నారని తెలిపారు. అసైన్డ్ భూములు… వక్ఫ్ భూములన్నీ మై హోమ్ వాళ్ళు లాక్కోవచ్చా? అని నిలదీశారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల లెక్క వాలిపోయారని విమర్శించారు. ఈ చర్చ రాకుండా ఉండాలనే సభలో గందరగోళం చేయాలని చూశారని తెలిపారు. ఆడబిడ్డలను అడ్డంపెట్టుకుని అడ్డుకోవాలి అనుకున్నారని చెప్పారు. శిశుపాలునికి కూడా వంద తప్పులు చేస్తేనే శిక్ష పడిందని గుర్తుచేశారు. ఏ రాక్షసుడికైనా సమయం వస్తుంది… అప్పుడే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. 22A ను అడ్డంపెట్టుకుని తమపై నిందలు వేయాలని చూశారని తెలిపారు. సంగారెడ్డి లో భూముల చిట్టా కూడా బయట పెడతానన్నారు. ఇలాంటి వాళ్లను మనం క్షమిస్తే.. మనల్ని భవిష్యత్ తరాలు క్షమించవని హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిన భూముల వివరాలు
తెలంగాణాలో భూముల అంశానికి సంబంధించి 22Aపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఉద్యమాలు చేసినోళ్లు సర్వం కోల్పోయారని.. తెలంగాణ ఉద్యమకారుడు మాత్రం వేలకోట్లు సంపాదించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం చెరపట్టిన భూముల వివరాలను అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
కేసీఆర్ భార్య శోభ పేరిట సిద్ధిపేటలో 67 ఎకరాలు భూమి
కేటీఆర్ పేరుతో 49 ఎకరాలు
ఆయన భార్య శైలజ పేరుతో 17.50 ఎకరాలు
కుమార్తె అలేఖ్య పేరుపై 9.3 ఎకరాలు
కుమారుడు హిమాన్ష్ పేరుపై 46.23
తన్నీరు హరీశ్ రావు 21, అతని భార్య పేరుపై 8.50 ఎకరాలు
కల్వకుంట్ల కవితకు మహబూబ్ నగర్ లో 14 ఎకరాలు
కవిత భర్త అనిల్‌కు 23 ఎకరాలు
జోగినిపల్లి సంతోష్ రావు తండ్రి పేరుపై 53.16 ఎకరాలు
సంతోష్‌రావు పేరుతో 18.21 ఎకరాలు
సంతోష్‌రావు భార్య పేరుతో 7.23 ఎకరాలు
మాజీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 52 ఎకరాలు, కొండల్ రావు 48 ఎకరాలు
-మొత్తంగా తొమ్మిది జిల్లాల్లో. 24 మండలాల్లో, 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి కేసీఆర్ కుటుంబం పేరిట ఉన్నది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు 2018 ఎన్నికలకు ముందు రూ.50 కోట్ల విలువైన భూమిని.. రూ.1.53 కోట్లకే క్రమబద్ధీకరించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరావు, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో 50 ఎకరాల ఫామ్ హౌస్‌ను నిర్మిస్తే, అందులో 11.05 ఎకరాల ఇనామ్ భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్‌మెంట్ భూమిలో ఫామ్‌హౌస్‌ను నిర్మించారు. .
భూ సమస్యల పరిష్కారానికి 12 సూత్రాలు
పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్‌సీ) పరిధిలోని మిగులు భూముల క్రమబద్దీకరణ ప్రభుత్వం నూతన విధానానాన్ని తీసుకొస్తుంది. పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతోపాటు కొత్త దరఖాస్తులను ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ క్రమబద్దీకరణ, రెండు సమాంతరంగా ఏకకాలంలో నిర్వహిస్తుంది.
అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూముల సమస్యలపై వారంరోజుల్లోగా ఒక సమగ్రవ్యవస్థను ఏర్పాటు చేసి, వాటిని పరిష్కరిస్తారు. ఇలాంటి ఆస్తుల క్రమబద్దీకరణ త్వరగా పూర్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది.
-సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి కమిటీలను నియమిస్తారు.
-జీవో నెంబర్ 59 సమస్యలకు సంబంధించి హక్కు బదిలీ పత్రాలు జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను తుది పరిశీలన జరిపి, పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం వేయనుంది. మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులను నూతన క్రమబద్దీకరణ విధానం ద్వారా క్లియర్ చేస్తారు.
-జీవోనెంబర్ 118తో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, వాటిని వెంటనే 22ఏ జాబితా నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇండ్ల సమస్యపై సమగ్ర న్యాయ సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటారు.
ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు యాజమాన్య హక్కుల విషయంలో విస్తృత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
లబ్దిదారుని సొంతస్థలంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు యాజమాన్య హక్కుల విషయంలో ఐదేండ్లు గడువు విధించి, తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తారు.
నాలా రుసుం చెల్లించని ప్రయివేటు పట్టా భూముల విషయంలో నాలా చార్జీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తారు.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లను నూతన క్రమబద్దీకరణ పథకంలోకి తీసుకొస్తారు.
సికింద్రాబాద్ పరిధిలోని లీజు హోల్డ్ ఆస్తుల ప్రీహోల్డ్ క్రమబద్దీకరణ విషయంలో 30 రోజుల నిర్ధిష్ట వ్యవధిలోగా అధికారుల కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది.
స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన అసైన్డ్ భూములు, భూదాన్ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తారు.దీని ద్వారా సేకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల గృహనిర్మాణానికి వినియోగిస్తారు.
22Aలో చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు
22A భూ వివాదానికి సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్డీవో మాత్రమే విచారణ ప్రారంభిస్తారు.
గ్రామాలు అయితే భూ సర్వే నెంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలను గుర్తిస్తారు.
పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు, బ్లాక్, ప్లాట్, డోర్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు.
రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్ ఇలాంటి సంబంధిత రికార్డుల వివరాలు సేకరించి, వాటిని పరిశీలిస్తారు. ప్రస్తుతం భూమి స్థితి ఏంటీ అనే విషయంపై నిర్థారణకు వస్తారు.
మొత్తం భూమిలో కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయితే.. ఆ భాగాన్ని మాత్రమే 22Aలో చేర్చుతారు.
మిగతా భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు.
సదరు భూ యజమానికి ముందుగా ఈకేవైసీ ద్వారా నోటీసులు ఇస్తారు. అందుబాటులో లేకపోతే ఈ- మెయిల్ లేదా ఆధార్ కు అనుసంధానమైన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు.
ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవసరం అయితే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇస్తారు. 15 రోజుల సమయం ఇస్తారు. ఈ సమయంలో సంబంధిత వ్వక్తి తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టకుండా కాపాడుకోవచ్చు.
సబ్ కలెక్టర్, ఆర్డీవో చేసే విచారణ ప్రక్రియ మొత్తాన్ని, సంబంధిత డాక్యుమెంట్లను ఆడియో కాపీతో సహా ఆర్డర్ కాపీని సంబంధిత వ్యక్తికి అందజేస్తారు.
22A జాబితాకు సంబంధించి వ్యవసాయ భూమి విస్తీర్ణం ఒక ఎకరానికి మించి ఉన్నా, వ్యవసాయేతర భూమి అయితే వెయ్యి గజాలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు ఇస్తుంది.
ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే.. ఆ భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చటం జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాతనే భూమికి సంబంధించిన వివరాలను ఐజీఆర్‌ఎస్ రికార్డుల్లో ఎక్కించటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ డేటా బేస్ లో ఆన్ లైన్ లో చేర్చుతారు.
22A నిషేధిత జాబితాలోకి ఎక్కడ కూడా మ్యాన్యువల్ గా చేర్చటం జరగదు. పూర్తి పారదర్శకంగానే సాగుతుంది.


