- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
- నవతెలంగాణ-సంగారెడ్డి: సమానత్వం సాధికారతకోసం మరో పోరాటం చేయాలని, విమోచనం పేరిట చరిత్రను మతోన్మాద శక్తులు వక్రీకరిస్తున్నాయని ఇది సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో తెలంగాణ సాయుధ రైతంగా పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహం నుండి సంగారెడ్డి న్యూ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా చుక్క రాములు హాజరై దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. సాయుధ పోరాటానికి ఆర్ఎస్ఎస్, బిజెపికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పోరాటాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య కొట్లాటగా మార్చేస్తున్నారన్నారు. మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. . సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనన్నారు. ఈ పోరాటానికి ఏమాత్రం సంబంధంలేని బిజెపి దాని అనుబంధ సంస్థలు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మార్చే కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో మత ఉద్రేకాన్ని సృష్టించి తమ ఎజెండాను అమలు చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రజలందరూ మతోన్మాద భావజాలంతో ముందుకు వస్తున్న బిజెపి తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నాడు తెలంగాణ ప్రాంతంలో దొరలు, జాగిర్దారులు,పటేల్ పట్వారిలు, ఈ ప్రాంత ప్రజలను దోచుకుతింటూ నాటి నైజాం రజాకారుల మూకలతో కుమ్మక్కయ్యారని నాడు ప్రజలను పట్టిపీడిస్తూ పన్నులను వసూలు చేయడమే కాకుండా వారి చేత వెట్టిచాకిరి చేయించారని దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచి దొరలు, జాగిర్దారులు, పటేల్,పట్వారిలకు, నైజాం రజాకార్ మూకలకు వ్యతిరేకంగా జరిపిన మహోన్నత పోరాటమే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లిం మతాల తేడా లేకుండా ప్రజలంతా కలిసి పోరాడారని గుర్తు చేశారు. ఆ ఉమ్మడి మతసామరస్య, వారసత్వాన్ని ఇప్పుడు బిజెపి తమ మతోన్మాద రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఈరోజు దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చేయాలన్న కుట్ర జరుగుతుందన్నారు.
ఇక్కడ పాలకులు ప్రజలకు అనేక రకమైన హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు పేదలకు అందడం లేదన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో మరిన్ని బలమైన పోరాటాలు నిర్వహిస్థమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, ప్రవీణ్ కుమార్, నాగేశ్వర్ రావు, కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, శ్రీధర్, శివ కుమార్, మహేష, బాబు రావు తది తరులు పాల్గొన్నారు.




