నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఐటీఐ (ITI) ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగార్థులు, ఆశా (ASHA) కార్యకర్తలు, కోవిడ్ కాలం నాటి ఆరోగ్య సిబ్బందితో సహా పలు వర్గాల వారు బుధవారం లక్నోలోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నియామకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. 2022 నుండి నియామక ప్రక్రియ ప్రారంభం కాలేదని ఐటీఐ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా సంగిని రాష్ట్ర అధ్యక్షురాలు మీరా సింగ్ మీడియా మాట్లాడుతూ.. కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. “ఆశా కార్యకర్తలు, ఆశా సంగినులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక డిమాండ్లు ఉన్నాయి. మా గౌరవ వేతనాన్ని పెంచాలి, మాకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మేము మా విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా, 2G మొబైల్ ఫోన్ల స్థానంలో 5G పరికరాలను అందించాలని, అలాగే ప్రస్తుతం ఉన్న రూ. 250 రీఛార్జ్ సదుపాయం బదులుగా 5G డేటా ప్యాక్‌ను సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లను తెలియజేయడానికి మేము ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌ను కలవడానికి వచ్చాము,” అని ఆమె పేర్కొన్నారు.



