51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం : కేంద్ర మంత్రివర్గ నిర్ణయం
అమలు తేదీని ఇంకా ప్రకటించని కేంద్రం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఉద్యోగుల సామాజిక భద్రత పరిధిని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో తప్పనిసరి సభ్యత్వానికి సంబంధించిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని చివరిసారిగా 2014 సెప్టెంబరులో రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత 12 ఏండ్లుగా పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. అంతకుముందు 2004 నుంచి 2014 వరకు ఇదే పరిమితి కొనసాగింది. వేతనాలు, ఆదాయాలు పెరగడం, సంఘటిత రంగంలో ఉద్యోగాల విస్తరణ, పలు రాష్ట్రాలు–వృత్తుల్లో కనీస వేతనాలు ప్రస్తుత రూ.15 వేల పరిమితికి చేరువ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే కొత్త వేతన పరిమితి అమల్లోకి వచ్చే తేదీని కేంద్రం ఇంకా ప్రకటించలేదు.
రూ.11,339 కోట్ల అదనపు భారం
వేతన పరిమితి పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పెరగనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు కేంద్రం అందిస్తున్న వార్షిక బడ్జెట్ మద్దతు సుమారు రూ.10,250 కోట్లు ఉండగా, తాజా నిర్ణయం అమలులోకి వస్తే అది ఏడాదికి సుమారు రూ.11,339 కోట్లకు చేరుతుందని అంచనా. ఐదేండ్ల కాలంలో మొత్తం వ్యయం సుమారు రూ.56,696 కోట్లుగా ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.
7.98 కోట్ల మంది సభ్యులు
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో సుమారు 7.98 కోట్ల మంది చందాదారులు ఉండగా, దాదాపు 7.68 లక్షల సంస్థలు చందాలు చెల్లిస్తున్నాయి. ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా సుమారు 82 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు. వేతన పరిమితి పెంపునకు సంబంధించి 2026 జూన్ 16న వ్యయ ఆర్థిక కమిటీ సిఫారసు చేసిన అనంతరం అంతర్ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం నేపథ్యంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఈపీఎఫ్ఓ తదుపరి చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలను చేపట్టనున్నాయి.



