నాలుగేండ్లలోనే లక్ష్యాన్ని సాధించాం :మోడీ
76 వ ఏట అడుగుపెట్టిన
ప్రధానికి పలువురి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : భారత సెమీకండక్టర్ రంగం రెండో దశలోకి అడుగుపెట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రపంచ దేశాలకు దశాబ్ద కాలం పట్టగా.. భారత్ మాత్రం కేవలం నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. సెమీకాన్ ఇండియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘కమర్షియల్ చిప్‌ల ఉత్పత్తికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రపంచ దేశాల నమ్మకాన్ని భారత్ సాధించింది. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో సెమీకండక్టర్ విభాగంపై దేశ విశ్వాసం మరింత బలపడింది. ఈ రంగానికి యువతే కీలకం. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంపైనే భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. చిప్‌ల డిజైన్, తయారీలో యువతకు తగిన శిక్షణ ఇస్తున్నాం. సెమీకండక్టర్ లక్ష్యాలను నెరవేర్చడంలో వారే కీలకం’’ అని మోడీ అన్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కూడా భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ ఇండియా-2026 ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో కొనసాగనుంది. 52 దేశాల నుంచి 600 పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నాయి. కాగా ప్రధాని మోడీ 76 వ ఏట అడుగుపెట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



