- ఐక్యరాజ్యసమితి వాస్తవ నిర్ధారణ బృందం
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ పై అమెరికా అకారణంగా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అణ్వ ఆయుధాల సాకుతో ఆ దేశంపై ఇబ్బడిముబ్బడిగా బాంబులతో దాడి చేసింది. ఈ వైమానిక దాడుల్లో మినాబ్‌లోని ఒక పాఠశాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 178 మంది బాలికలు కన్నుమూశారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రపంచ దేశాల ఆందోళనలతో ఈ యుద్ధంలో అమెరికా ఆకృత్యాలపై ఐక్యరాజ్యసమతి నిజనిర్ధారణ కమిటీ వేసింది. తాజాగా కమిటీ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరాన్లో దాడుల వెనుక అమెరికా ఉందనడానికి “సహేతుకమైన ఆధారాలు” ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వాస్తవ నిర్ధారణ బృందం గుర్తించింది. ఇరాన్‌పై జరిపిన రెండు దాడుల్లో అగ్రరాజ్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని, ఇది యుద్ధ నేరాల పరిధిలోకి వస్తుందని ఆ బృందం పేర్కొంది.
కాగా, పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన(ఫిబ్రవరి-2026) సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండగా మినాబ్‌లోని ఓ పాఠశాలను క్షిపణి తాకింది. ఈ ఘటనలో 168 మంది మృతి చెందారని, వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.



