– సొంత కార్యక్రమాలకే కవిత అధిక ప్రాధాన్యత
– భారత జాగృతి పేరిట పలు పర్యటనలు
– సామాజిక తెలంగాణ కల నెరవేరలేదంటూ వ్యాఖ్యలు
– రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత అజెండాతో ముందుకెళుతున్నారా? తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు వీలుగా ఆమె వ్యూహాలు పన్నుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఇటీవల కాలంలో ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత జాగృతి పేరిట పలు జిల్లాల్లో పర్యటిస్తున్న ఆమె… ఆ పేరుతో సొంత క్యాడర్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారనే గుసగుసలు వినబడు తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె… ‘సామాజిక తెలంగాణ కల ఇంకా సాకారం కాలేదు…’ అంటూ వ్యాఖ్యా నించటం గమనార్హం. అయితే తెలంగాణ వచ్చిన 2014 నుంచి పదేండ్ల పాటు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్సే కదా..? అలాంటప్పుడు ఆ పార్టీ ఏలుబడిలో సామాజిక తెలంగాణ రాలేదనే అర్థం స్ఫురించే విధంగా కవిత వ్యాఖ్యలు చేయటమేంటనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవు తున్నాయి. దీన్నిబట్టి ఆమె తన సొంత ఇమేజ్‌ను, బలాన్ని పెంచుకునే పనిలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదనలు కారు పార్టీలో బలంగా వినబడుతున్నాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా కవిత… శాసన మండలిలో తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఒక్కోసారి మండలిలో ఆ పార్టీ నేత మధుసూదనాచారిని మించి కవిత అనేకాంశాలపై గళమెత్తిన సందర్భాలున్నాయి. ఇక మండలి బయట కూడా బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు తదితర డిమాండ్లపై పలు సంఘాలు, సంస్థలతో ఆమె సదస్సులు, సెమినార్లు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్‌కు భారత జాగృతి తరపున రిపోర్టును సమర్పించారు. ఈ అంశాలన్నింటిపై దాదాపు 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటించారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యక్రమాలను తోసిరాజని… తన సొంత ప్రోగ్రాములతో ఆమె హల్‌చల్ చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ‘కవిత సొంత అజెండా’తో ముందుకెళుతున్నారనే వాదనలు కూడా వినబడుతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం…రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే సన్నాహాల్లో కవిత ఉన్నారని తెలిసింది. ఈ విషయాన్ని తన తండ్రి కేసీఆర్‌కు కూడా ఆమె ఇప్పటికే తెలిపినట్టు వినికిడి. అయితే ఈ ప్రతిపాదనను ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారని సమాచారం. కాగా రాజకీయ కారణాలు.. కేసుల కారణంగానే కవిత ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘ఇప్పుడున్న కేసులు, ఒత్తిళ్ల’ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెట్టకుండా బీజేపీలో చేరొచ్చనే వాదనలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ విషయంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి.
అమెరికాకు కవిత…
తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనటానికి కవిత శుక్రవారం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటున్న ఆమె విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కవితకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 23 వరకు ఆమె అమెరికాలో పర్యటించనున్నారు. అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. కవిత తన వెంట చిన్న కుమారుడు ఆర్యను కూడా తీసుకుని వెళ్లారు.
వ్యూహమేంటి..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES