ఎల్లంపల్లి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తాం
బాధిత కుటుంబానికి ఇల్లు, ఐదెకరాల భూమి ఇప్పిస్తాం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య
అధికారులతో కలిసి బాధితులను పరామర్శ
రూ.4.12లక్షల చెక్కు అందజేత
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్‌ను పాశవికంగా హత్య చేసిన నిందితులకు భవిష్యత్‌లో జీవిత ఖైదు శిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణ చందర్, షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీ నారాయణ, సీఐ విజరుకుమార్‌తో కలిసి ఆయన రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ భార్య ఎర్ర వాణి, తండ్రి మల్లేష్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల చెక్కును అంద జేశారు. అనంతరం బక్కి వెంకటయ్య మాట్లాడుతూ .. యువతిని ప్రేమించినందుకు యువకుని అన్నను పాశవికంగా హత్య చేయడం, దహనం చేయడం సమాజానికే అవమానకరమని అన్నారు.
రాజశేఖర్ కుటుంబ పరిస్థితిని చూస్తే తనకు ఎంతో బాధ కలుగుతుందన్నారు. పేదరికం అనుభవిస్తున్న రాజశేఖర్ కుటుంబానికి అధికారులు అండగా నిలబడాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించారు. రాజశేఖర్ ను హత్య చేసిన నిందితు లను ప్రభుత్వం వదిలి పెట్టబోదని, ముఖ్య మంత్రితో మాట్లాడి వారికి కఠిన కరాగార శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరా బాద్‌లో రూ.50 లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇల్లు, ఐదెకరాల భూమిని అందించే ఏర్పాట్లు చేస్తా మని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
అలాగే, రాజశేఖర్ కుటుంబాన్ని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి రూ.50 వేల సాయం అందజేశారు. వారి వెంట రాష్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబునాయక్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఎస్సీ డిడి రామారావు, తహసీల్దార్ నాగయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తదితరులు ఉన్నారు.



