గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక కీలక పాత్ర
వ్యవసాయంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విలాసం కాదు అవసరం :నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్‌కు బాటలు వేయాలి
రైతాంగానికి చేయూతనిస్తున్న నాబార్డ్‌కు ధన్యవాదాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ భారత పునరుద్ధరణలో నాబార్డ్ నిశ్శబ్దశక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వాడటం విలాసం కాదనీ, అది తప్పనిసరి అవసరమని నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో నాబార్డు, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామనీ, 22 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. పంటల కొనుగోలు వ్యవస్థను పారదర్శకంగా మార్చామని తెలిపారు. వేటినైనా ఆపొచ్చుగానీ వ్యవసాయం ఆగకూడదనే కారణంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, వంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని నెహ్రూ చేపట్టారనీ, హరితవిప్లవం విజయవంతం కావడానికి ఇందిరాగాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నదని వివరించారు.
భారత జాతి నిర్మాణ కాలంలో పుట్టి, శాంతిగా పనిచేస్తూ నిలిచిన గొప్ప సంస్థల్లో నాబార్డు ఒకటని కొనియాడారు. నాబార్డ్ లేకపోతే గ్రామీణ భారత్ ఇవాళ ఇలా ఉండేది కాదన్నారు. వ్యవసాయంలో ఆధునీకరణ, సహకార సంస్థల బలోపేతం, ఎఫ్‌పీఓలకు సుస్థిర శక్తి ఇవ్వడం, గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక నాబార్డు కృషిని వివరించారు. ఎర్త్ సమ్మిట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. టీఫైబర్ ద్వారా 43 వేల కిలోమీటర్లకుపైగా ఉన్న డిజిటల్ బ్యాక్‌బోన్ ప్రతి పంచాయతీని కలుపుతున్నదని తెలిపారు. వాతావరణ స్మార్ట్ వ్యవసాయం విషయానికొస్తే పల్లెలో నీటిని ఆదా చేసే పద్ధతులతో, పొలాల్లో కార్బన్ తగ్గించే చర్యలతో భారతదేశంలోనే మొదటి గోల్డ్ స్టాండర్డ్ కార్బన్ క్రెడిట్స్‌ను తెలంగాణ అందించిందని వివరించారు. డ్రోన్ల ద్వారా పంటల నిర్వహణ, మట్టి విశ్లేషణ, ఎఫ్‌పీఓ ప్లాట్‌ఫారాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్‌కు బాటలు వేయాలని ఆకాంక్షించారు. నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ వస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్ కు ధన్యవాదాలు తెలిపారు. మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలనీ, అందుకోసం మార్కెటింగ్ కో ఆపరేటివ్ తో పాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాబార్డు చైర్మెన్ షాజీ కేవీ, డిప్యూటీ ఎమ్‌డీ గోవర్థన్‌సింగ్ రావత్, డాక్టర్ అజయ్ కుమార్ సూద్, తదితరులు పాల్గొన్నారు.



