Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంశిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిద్దాం

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిద్దాం

- Advertisement -

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొందాం
రోడ్‌మ్యాప్‌నకు బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా పిలుపు
కాప్‌30 సదస్సులో కీలకాంశాలపై పలు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు


బెలేం(బ్రెజిల్‌) : కాప్‌30 సదస్సులో భాగంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఒకే వేదికపై పని చేయాలనే లక్ష్యంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో ద సిల్వా విస్తృత ప్రయత్నాలు చేశారు. అయితే అనేక కీలకాంశాలపై పలు దేశాల మధ్య విభేదాలు కనిపించాయి. అమెరికా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై చర్చలపై మరింత ప్రభావం చూపింది. బుధవారం లులా.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో కలిసి పలు దేశాల నాయకులతో సమావేశమయ్యారు. శిలాజ ఇంధనాలను తగ్గించడంలో, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ఒక సామూహిక రోడ్‌మ్యాప్‌నకు ప్రయత్నించారు. ఏ దేశాన్నీ బలవంతం చేయకుండా.. ప్రతీ దేశం తన సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా ఒక రోడ్‌మ్యాప్‌ అవసరమని ఆయన అన్నారు.

వాతావరణ చర్యలు, పాశ్చాత్యేతర దేశాల మధ్య సహకారానికి ప్రముఖ ప్రతినిధిగా ఉన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు.. శిలాజ ఇంధనాల వినియోగం, వాతావరణ నిధుల బాధ్యత వంటి కీలక అంశాలపై దేశాల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించటంలో తీవ్ర ప్రయత్నాలే చేస్తోన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించకపోతే భూమి పర్యావరణ వ్యవస్థలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకొని కఠినమైన ప్రమాదాలకు దారి తీసే అవకాశమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా పేద దేశాలపై మరింతగా ఉంటాయని అంటున్నారు. ఇక భారత్‌ సహా కొన్ని ఇతర దేశాలు ధనిక దేశాలపై విమర్శలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందిన దేశాలదేననీ, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలో అవరోధాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ”వాతావరణ మార్పు సుదూర ముప్పుకాదు. సమీపంలో ఉన్న ప్రమాదం” అని సదస్సులో మాట్లాడిన భారత పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అన్నారు. భారత్‌ తన వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను సదస్సు డిసెంబర్‌లోనే సమర్పించే అవకాశమున్నదని తెలిపారు.

కాప్‌31కు టర్కీ ఆతిథ్యం
ఇక వచ్చే ఏడాది జరగనున్న కాప్‌31 సదస్సుకు టర్కీ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందుకు అంటల్యా నగరం వేదిక కానున్నది. కాప్‌31కి ఆతిథ్యం విషయంలో ఆస్ట్రేలియా, టర్కీ మధ్య నెలల తరబడి సాగిన పోరు ముగిసిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ తెలిపారు. ఇది ఆస్ట్రేలియా, టర్కీ రెండింటికీ పెద్ద విజయమని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -