Friday, November 21, 2025
E-PAPER
Homeజాతీయంనకిలీ ఎస్‌టి సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోండి

నకిలీ ఎస్‌టి సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోండి

- Advertisement -

బెంగాల్‌లోని బంకురలో గళమెత్తిన గిరిజనలు
బంకుర : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నవేళ.. పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌ మహల్‌ జిల్లాలోని గిరిజనులు మాత్రం ఎస్‌ఐఆర్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా తమ జిల్లాకు సమీప పట్టణమైన బంకురలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 10 వేలకు పైగా గిరిజనలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌కు నినదించారు. అయితే ఈ ఎస్‌ఐఆర్‌ డిమాండ్‌ ఓటర్ల జాబితాకు సంబంధించినది కాదు. రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వం గత దశాబ్దకాలంలో జారీ చేసిన ఎస్‌టి ధ్రువపత్రాలు గురించి. ప్రభుత్వం జారీ చేసిన ఎస్‌టి సర్టిఫికెట్లపై ఎస్‌ఐఆర్‌ నిర్వహించాలని, నకిలీ ధ్రువపత్రాలపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివాసీ కళ్యాణ్‌ సమితి (ఎకెఎస్‌) పిలుపు మేరకు బంకురా సమ్మిలానీ కళాశాలలో జరిగిన ఈ ర్యాలీలో వివిధ తెగల గిరజనులు పాల్గొన్నారు. ఎకెఎస్‌ సమాచారం ప్రకారం రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న బంకురా, పురులియా, ఝుర్‌గ్రామ్‌, పశ్చిమ మెదనీపూర్‌ జిల్లాల్లో ఎస్‌టి ధ్రువపత్రాల జారీలో భారీగా అవినీతి చోటు చేసుకుంది. ఈ జిల్లాల్లో ఉన్న గిరిజనుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ధ్రువపత్రాలను జారీ చేశారని ఎకెఎస్‌ విమర్శిస్తోంది.

అవినీతి ఫలితంగా గిరిజనేతరులు కూడా ఎస్‌టి హోదా పొందారని, వైద్య, ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో సీట్లు పొందడంతో పాటు ఉద్యోగాల్లోనూ చేరారనని ఎకెఎస్‌ ఆరోపిస్తోంది. ఇది కేవలం కుల ధ్రువీక రణాల సమస్య కాదని, గిరిజనుల గౌరవం, సంప్రదాయాలు, సంస్కృతి, జీవించే హక్కుపై దాడి అని ఎకెఎస్‌ పేర్కొంది. ఈ ర్యాలీలో పాల్గొన్న గిరిజన నాయకులు మాట్లాడుతూ తమ హక్కులను కాపాడుకోవడానికి నిరంతర పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, గిరిజనుల రాజ్యాంగ హక్కులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రక్షించాలని డిమాండ్‌ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో గిరిజన జనాభా 52,96,963 మందని, కానీ 2024 వరకూ ప్రభుత్వం సుమారు 80 లక్షల మందికి ఎస్‌టి సర్టిఫికెట్లు జారీ చేసిందని గిరిజన నాయకులు తెలిపారు. రాష్ట్రంలో అంతమంది గిరిజనులు ఉన్నారా.. అని ప్రశ్నించారు. టిఎంసి నాయకులు కూడా వివిధ ఎన్నికల్లో పోటీ చేయడానికి గిరిజన హోదా సర్టిఫికెట్లను దుర్వినియోగం చేశారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -