Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట

రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట

- Advertisement -

కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం దుర్మార్గం
ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
న్యాయపరంగా ఎదుర్కొంటాం : మాజీ మంత్రి హరీశ్‌రావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫార్ములా ఈ కారు రేస్‌కు సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతించడం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో గురువారం స్పందించారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేండ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నదని తెలిపారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. అక్రమ కేసులతో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.

కేటీఆర్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్న ప్రభుత్వం : కెఆర్‌ సురేశ్‌రెడ్డి
కేటీఆర్‌ను రాజకీయంగా బలహీనపర్చాలని గవర్నర్‌ ప్రాసిక్యూషన్‌ను అనుమతిచ్చారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కెఆర్‌ సురేశ్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ విజన్‌తో హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందని వివరించారు. రాజకీయ కక్షతో కేటీఆర్‌ ఇమేజ్‌ ను దెబ్బతీయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తున్నదని అన్నారు. ఆయన గొంతు వినిపించకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలకు సమాధానం చెప్పలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు.

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌లో కొత్తగా విచారించేది ఏముందనీ, ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి థర్డ్‌ క్లాస్‌ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చెప్పారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి కేటీఆర్‌ను కూడా జైలుకు పంపాలని భావిస్తున్నారని అన్నారు. కేటీఆర్‌ ఇమేజ్‌ను చూసి సీఎం రేవంత్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌పై కక్షసాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. బీఆర్‌ఎస్‌ను కట్టడి చేయడానికి కేటీఆర్‌ను ఎదుర్కోవడానికి రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

ఫార్ములా-ఈ కేసు పూర్తిగా కల్పితమనీ, కక్ష సాధింపు రాజకీయ ఎత్తుగడగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూపొందించిన వ్యక్తిగత ప్రతీకార నాటకమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఖండించారు. కేటీఆర్‌ వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. కక్షసాధింపులో భాగమే ఈ కేసు అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడమే ప్రజా పాలన అవుతుందా?అని కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే కేటీఆర్‌ను విచారణల పేరుతో వేధించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -