ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షుడు అలపాటి సురేష్
‘రైతన్నకు వెన్నుదన్ను’ పుస్తకం ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్
అగ్రి జర్నలిస్టులు వ్యవసాయ వార్తలు రాయడమంటే దేశ అభ్యున్నతికి తోడ్పడడమేనని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అధ్యక్షుడు అలపాటి సురేశ్ అన్నారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో పత్రిక, శ్రవణ, దృశ్య మాధ్యమాల ద్వారా అన్నదాతల ప్రగతికి తోడ్పడిన యాభై మంది అగ్రికల్చర్ జర్నలిస్టుల కృషిని పరిచయం చేస్తూ వలేటి గోపీచంద్ రాసిన ‘రైతన్నకు వెన్నుదన్ను’ పుస్తకాన్ని బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అర్థమయ్యే రీతిలో కథనాలు రూపొందిం చడంలో ఆనాటి ఆకాశవాణి పాత్రికేయుల ప్రయత్నం శ్లాఘనీయమన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ సంచాలకుడు రావి చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనా ఫలాలు, అధ్యయన విశేషాలను సమాచారాన్ని సరళ భాషలోకి మార్చి రైతులకు తెలియజేయడంలో అగ్రి జర్నలిస్టుల పాత్ర అమూల్యమైనదని ప్రశంసించారు. ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పీఎస్ గోపాలకృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు మందలపర్తి కిషోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రైతునేస్తం వెంకటేశ్వరరావు, చెన్నూరు సీతారాంబాబు తదితరులు గోపీచంద్ ప్రయత్నాన్ని అభినందించారు. చిరుధాన్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబును ఐవీ సుబ్బారావు, స్మారక కమిటీ సభ్యులు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అదే విధంగా అగ్రి పాత్రికేయుడు సంఘమేశ్వరరావును సన్మానించారు.



