పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ విద్యావేత్త, మాజీ శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం ఆయన నివాసంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.విద్యావేత్త చుక్క రామయ్య వరంగల్ జిల్లా గూడురు గ్రామంలో నవంబర్ 20, 1925న జన్మించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ చదువును ప్రోత్సాహాన్ని అందించి ఎందరినో తీర్చిదిద్దిన చుక్కా రామయ్య విద్యారంగానికి దిక్సూచి అని పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ గవర్నర్లు, పలు పార్టీల రథసారదులు రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ మట్టికి విశ్వఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఐఐటి రామయ్య కృషి మరిచిపోలేనిదన్నారు. సిలికాన్ వాలి తెలుగు వారితో నిండిపోడానికి కారణం చుక్కా రామయ్య ప్రేరణ ఎంతో ఉందని కొనియాడారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం.కోదండరామ్, తెలంగాణ రచయితల వేదిక మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సిడబ్ల్యుసి సభ్యుడు గిడుగు రుద్రరాజు, ప్రొఫెసర్ హరగోపాల్, మాడభూషి శ్రీధర్, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, సామాజిక కార్యకర్త కోయ చంద్రమోహన్, సారంగపాణి, పలు జిల్లాలకు సంబంధించిన విద్యాసంస్థల నిర్వాహకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యావేత్త చుక్కా రామయ్య రాసిన ”సాధకులు-బోధకులు”, ”రెండవ పాఠం” పునర్ముద్రణ పుస్తకాలను పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంచి ఉపాధ్యాయునిగా నిలిచి ఎందరెందరినో తీర్చిదిద్దిన చుక్కా రామయ్య 100వ జన్మదినాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రామయ్య ఆలోచనలు తీసుకుని ముందుకు సాగితే విద్యారంగం ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజాపాలనలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్దతగల ఉపాధ్యాయునికి నిర్వచనం చుక్కా రామయ్యేనని తెలిపారు. రామయ్యను స్ఫూర్తిగా తీసుకుని తరగతి గదులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఈనాటి ఉపాధ్యాయ లోకంపై ఉందని తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు ప్రపంచ దేశాల్లో స్థిరపడటానికి చుక్కా రామయ్యే కారకుడని కొనియాడారు. విద్యా ప్రదాతగానే కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనవంతు పాత్రను పోషించారని కొనియాడారు. చుక్కా రామయ్య నూరేండ్లు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టిన రోజును జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ జీవితాన్ని తరగతి గదికే అంకితం చేసి ఈ నేల స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన చుక్కా రామయ్య ధన్యుడని కొనియాడారు. నిబద్దత, నిమగతలను నిదర్శనంగా జీవిస్తున్నారని తెలిపారు. భోదనే జీవితంగా వృత్తికి అంకితమైన మహామనిషి అని చెప్పారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన నిత్యవిద్యార్థి చుక్కా రామయ్య అని కొనియాడారు.
చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి
అద్భుత విద్యా బోధనతో యువత భవితకు బంగారు బాటలు వేసి ఐఐటీ రామయ్యగా పేరుగాంచి, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన మేధావి చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి శత వసంత జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చుక్కా రామయ్య మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకున్నారు.



