Saturday, May 17, 2025
Homeప్రధాన వార్తలుమానవత్వ పండుగ

మానవత్వ పండుగ

- Advertisement -

– ప్రభుత్వమే అనాథ యువతికి పెండ్లి పెద్ద
– పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చొరవతో ‘మానస’ పెండ్లి
– మేమున్నామంటూ ముందుకొచ్చిన అధికార యంత్రాంగం
– ఈ నెల 21న వివాహానికి ఘనంగా ఏర్పాట్లు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

అందరి కండ్లల్లో ఆనందం, మనసుల్లో మానవత్వం నింపే ఓ అపురూప దృశ్యం పెద్దపల్లి జిల్లాలో ఆవిష్కృతమవుతోంది. అమ్మానాన్నలు లేని ఓ అనాథ యువతికి ప్రభుత్వమే అండగా నిలిచి, అన్నీ తామై పెండ్లి జరిపించేందుకు ముందుకొచ్చింది. జిల్లా కలెక్టర్‌, సంక్షేమ శాఖ అధికారి పెండ్లి పెద్దలుగా మారి వివాహ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది కేవలం ఒక పెండ్లి వేడుక కాదు, సమాజంలో అనాథలకు తామున్నామని చాటి చెప్పే మహత్తర సందేశంగా చెప్పొచ్చని అధికారులు చెబుతున్నారు. అందరికీ స్ఫూర్తినిచ్చే ఈ సంఘటన పెద్దపల్లి వేదికగా ఆవిష్కారం కాబోతోంది.
పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఎన్‌.మానస 12వ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమెను రామగుండంలోని తబిత బాలల సంరక్షణ సంస్థ చేరదీసి, కంటికి రెప్పలా చూసుకుంది. ఆశ్రయం కల్పించి, డిగ్రీ పూర్తి చేసేలా అండగా నిలిచింది. జీవితంలో తాను కూడా ఒక ఇంటికి దీపం కావాలని కలలు కన్న మానసకు, ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన మాస రేణుక-యాకయ్య దంపతుల ఏకైక కుమారుడు రాజేష్‌తో మానస వివాహం నిశ్చయమైంది.
కలెక్టర్‌ కరుణామయం
పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీహర్ష మానస వివాహాన్ని తన బాధ్యతగా స్వీకరించారు. రాజేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడమే కాకుండా.. పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేయించారు. అనంతరం, రాజేష్‌ తల్లిదండ్రులతో పలు సూచనలతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, జిల్లా సంక్షేమ అధికారి పి.వేణుగోపాల్‌రావు మానస వివాహానికి పెండ్లి పెద్దలయ్యారు. ఈ నెల 21న పెద్దపల్లి కలెక్టరేట్‌ రోడ్డు సమీపంలోని శ్రీవెంకటేశ్వర కళ్యాణ మండపంలో పెండ్లి జరపబోతున్నారు. కలెక్టర్‌ స్వయంగా వివాహ ఖర్చులను భరిస్తూ, వధూవరులకు అన్నీ తామై అండగా నిలబడుతున్నారు. జిల్లా వెల్ఫేర్‌ అధికారి, లోకల్‌బాడీస్‌ అడిషన్‌ కలెక్టర్‌ జె.అరుణశ్రీ, మరో అడిషన్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డి.వేణు, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌, ఎన్జీవో అధ్యక్షులు రవీందర్‌, టీఎన్‌జీవో అధ్యక్షులు బి.శంకర్‌ తదితర అధికారులు ఈ వేడుకను ఘనంగా జరిపించేందుకు కృషి చేస్తున్నారు.
కరీంనగర్‌లోనూ..
గత నెల మార్చి 9న కరీంనగర్‌ జిల్లాలోనూ కలెక్టర్‌ పమేలా సత్పతి చొరవతో ఇదే స్ఫూర్తి ఆవిష్కృతమైంది. మౌనిక (పూజ) అనే అనాథ యువతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కళాభారతి వేదికగా కలెక్టర్‌ పమేలా సత్పతి పెండ్లి పెద్దగా వ్యవహరించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మౌనిక తల్లిదండ్రులు 2017లో మరణించగా, బాలసదన్‌ అధికారులు ఆమెను చేరదీసి, సొంత బిడ్డలా చూసుకున్నారు. మౌనిక ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకుని, ఆ తర్వాత ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేసింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. మౌనిక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సాయితేజ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహానికి ఒప్పించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, పలు ఎన్జీవోల ప్రతినిధులు ఈ పెండ్లికి ఆర్థిక సహాయం అందించారు. మౌనిక వివాహ బాధ్యతలను కలెక్టర్‌ పమేలా సత్పతి తీసుకున్నారు.
ఇది ఒక బాధ్యత : పి. వేణుగోపాల్‌రావు, పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి
మానస మా సొంత బిడ్డలాంటిది. ఆమెకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చడం, ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం మా బాధ్యతగా భావించాం. కలెక్టర్‌ చొరవ, ఆయన దిశానిర్దేశంతో ఈ వివాహం ఇంత ఘనంగా జరుగబోతుంది. పెండ్లి మాత్రమే కాదు, హల్దీ, సంగీత్‌ వంటి ప్రతి వేడుకనూ ఒక కుటుంబంలా ముందుండి జరిపిస్తున్నాం. ఆమెకు అవసరమైన ఇంటి సామాగ్రి, ఏడాదికి సరిపడా సరుకులు అన్నీ సమకూర్చుతున్నాం. ఇది మాకు ఒక బాధ్యత.
ఆదర్శప్రాయమైన అధికార యంత్రాంగం
పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు చూపిన ఈ చొరవ నిజంగా ఆదర్శప్రాయం. ఇలాంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉన్నారు. అనాథ యువతుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, మరెందరికో ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ అధికారులు తమ విధులకు అతీతంగా ఒక కుటుంబ సభ్యుల్లా అనాథల పట్ల చూపిన ప్రేమ, బాధ్యత ప్రశంసనీయమని చెప్పాలి. ఈ వివాహాలు అనాథ యువతులకు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సహాయపడటమే కాకుండా, సమాజంలో వారి స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ మానవీయ ప్రయాణం, ప్రతి హదయాన్నీ స్పర్శించి, సేవాభావాన్ని పెంపొందించే గొప్ప సంకల్పంగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -