నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం యువరైతు ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం సృష్టించింది. చౌటకూర్ గ్రామానికి చెందిన దూడ మాణయ్యకు చెందిన గ్రామ శివారులోని సర్వే నంబర్ 1531 లో 2.22 గుంటల భూమిని పర్వత్ గారి విజయభాస్కర్ రెడ్డి వాళ్లకు ఇచ్చి,1527 సర్వే నెంబరులో ని 0.37 గుంటల భూమి గత 50 ఏండ్ల క్రితం తీసుకున్నామని రైతు తెలిపారు. 0.7 గుంటల భూమి కెనాల్ కాలువలో పోగా మిగతా 30 గుంటల భూమిని సాగు చేస్తున్నామని రైతు తెలిపారు. గతంలో రైతు దూడ మాణయ్య ఆ భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకోలేదని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళగా పర్వత్ గారి విజయభాస్కర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తనను వేదింపులకు గురి చేస్తున్నారని బాధిత రైతు అవేదన వ్యక్తం చేశాడు.
ఈ భూమికి సంబంధించిన ఒప్పంద లిఖిత పత్రాలు ( డాక్యు మెంట్స్ ) తన వద్ద లేకపోవడంతో ఏమి చేయలేమంటూ రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు.తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను మాణయ్య వేడుకున్నారు.ఈ క్రమంలోనే దూడ మాణయ్య కుమారుడు మల్లేశం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి వెంటనే అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని అడ్డుకున్నారు. వెంటనే తహసిల్దార్ కిష్టయ్య విజయభాస్కర్ రెడ్డిని పిలిపించి మాట్లాడి ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు.



