– పైలెట్ ప్రాజెక్టు కింద మండలాల ఎంపిక
– సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణ
– క్షేత్ర స్థాయిలో మొదలైన విచారణ
– ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్లాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం కింద స్వీకరించిన దరఖాస్తులపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ముందుగా కొన్ని మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఆయా మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రణాళిక వేశారు. మొదటి దఫా కింద ఏప్రిల్ 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో అమలు చేశారు. రెండో దఫా కింద 28 జిల్లాల్లోని 28 మండలాల్లో విచారణ చేయబోతున్నారు.
మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కీసర మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. ఈనెల 5 తేదీన ప్రారంభమైన ఈ సదస్సులు 13వ తేదీతో ముగిశాయి. ఇందులో రైతులు వివిధ సమస్యలపై మొత్తం 1,054 దరఖాస్తులు అందించారు. అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 709 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా ఓఆర్‌సీ, 38-ఈ సమస్యలపై 3 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి ఈ నెలాఖరులోగా విచారణ పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
5-13వ తేదీ వరకు సదస్సులు
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు కీసర మండలాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు తహసీల్దార్ అశోక్ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్‌రెడ్డితోపాటు అధికారులు పర్యవేక్షించారు. దాదాపు వెయ్యి మందికిపైగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించారు. రైతులకు సహకారం అందించేందుకు ఆయా గ్రామాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండి దరఖాస్తులను నింపి ప్రత్యేక పోర్టల్లో నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు.
క్షేత్రస్థాయి పరిశీలన
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని, భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, మ్యూటేషన్ అమలు కాలేదన్న తదితర సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్, సీనియర్ ఆసిస్టెంట్, వీఆర్‌ఎలతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. వీరు గ్రామాలకు వెళ్లి దరఖాస్తుదారులు, అభ్యంతరాలు చెప్పిన వారిని పిలిపించి పరిశీలన ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి రోజూ సమగ్రమైన విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి నివేదికలు అధికారులకు అందజేస్తున్నారు. ఈ నెల చివరికి వరకు సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కలెక్టర్, ఆడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయిలో మానిటరింట్ జరుగుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో చిలిపిచెడ్, సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్నారు. మెదక్ జిల్లాలోని చిలిపిచేడ్‌లో మొత్తం 6 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. అందులో 15 గ్రామాల్లో 864 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఇందులో 15 మంది రైతుల దరఖాస్తులు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఆధార్ తప్పిదాలు, స్త్రీ, పురుష తప్పిదాల దరఖాస్తులు పరిష్కరించినట్టు చెప్పారు. శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తహసీల్దార్ సహదేవు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 1395 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఎక్కువగా ఆన్‌లైన్‌లో భూమి చూపించడం లేదని, మిస్సింగ్ దరఖాస్తులు, డిజిటల్స్ సైన్ లేకపోవడం, ప్రధానంగా ప్రభుత్వ భూములు కబ్జా ఉన్నవారికి సర్టిఫికెట్ ఇవ్వాలని, ఓఆర్‌సి ఇంప్లిమెంటేషన్, పట్టా భూమి అసైన్ భూమిలో పడటం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ నెల 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలాన్ని పైలెట్‌గా ఎంపిక చేసి 1027దరఖాస్తులు స్వీకరించినట్టు జిల్లా అధికారులు తెలిపారు.
అత్యధికంగా మిస్సింగ్ సర్వే నెంబర్లు
కీసర మండల పరిధిలోని 15 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి సదస్సులో మొత్తం 1,054 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా న్యూ పీపీబీ/మ్యుటేషన్/కోర్టు కేసులకు సంబంధించి 709 దరఖాస్తులు వచ్చాయి. ధరణిలో దరఖాస్తు చేసుకోగా.. భూ భారతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 525 వచ్చాయి. పీపీబీఎస్ తప్పుగా నమోదు చేసినవి 22, తప్పుల సవరణ కోసం పొడిగించినవి 125, ప్రొహిబిషన్ లిస్టులో ఉన్నవి 103, సాదాబైనమాల కోసం మీ సేవాలో దరఖాస్తు చేసినవి 10, మీ సేవాలో దరఖాస్తు చేయనివి 6, ఓఆర్‌సీ 3, 38-ఈ సమస్యలపై 3 దరఖాస్తులు వచ్చాయి. ఇతర సమస్యలపై మరో 56 దరఖాస్తులు అందాయి.
‘భూభారతి’ దరఖాస్తులపై కసరత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES