Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

సామ బుచ్చిరెడ్డి టీడబ్ల్యూజెఎఫ్ ములుగు జిల్లా కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ములుగు జిల్లా కార్యదర్శి సామ బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షులు ఆవుల వెంకన్న ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ దివాకర టీఎస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యదర్శి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నది. పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమమే ఏజెండాగా కృషి చేస్తున్నది. జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందింది. వేలాది మంది సభ్యత్వం కలిగిన ఫెడరేషన్, సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్కేర్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నది. వినతిపత్రాలు, దరఖాస్తులు ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి తెస్తున్నదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల ఇండ్లస్థలాల సమస్య ఏండ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నది.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లోని వేయి మంది జర్నలిస్టులకు ఇండ్లస్థలాలను కేటాయించింది. అందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి అశేష జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాగా సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఈనేపథ్యంలో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైదరాబాదోపాటు మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నివాస సౌకర్యం లేక అనేక ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.

అక్రిడిటేషన్లు గత ఏడాదిన్నర కాలంగా స్టిక్కర్లతో నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల అక్రిడిటేషన్ కార్డులున్నాయి. పర్మినెంట్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఇచ్చిన హెల్త్ కార్డులు ఎందుకూ పనికిరావడం లేదు. రాష్ట్రంలో దాదాపు 40 వేల హెల్త్ కార్డులు ఉన్నాయి. వీటిని కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రులు గౌరవించడం లేదు. కేవలం హైదరాబాద్లోని నీమ్స్ మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఇతర ఏ ఆసుపత్రులూ వీటితో చికిత్సను అందించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు కొత్త విధానం తేచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

అదే విధానాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. కంట్రీబ్యూషన్ మాత్రం ప్రభుత్వమే భరించాలి. ఇకపోతే జర్నలిస్టుల పై ఇటీవల దాడులు పెరిగాయి. వీటి నిరోధానికి వెంటనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీస్, న్యాయ, రెవెన్యూ, సమాచార, జీఏడీ శాఖలతో కలిపి హైపవర్ కమిటీలను నియమించాలి. ఇప్పటికే సర్కారు జీవో ఇచ్చినప్పటికి అమల్లోకి రాలేదు. కార్మిక శాఖ పరిధిలో ఉన్న త్రైపాక్షిక కమిటీలను ప్రకటించి, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా కలం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జి ఎస్ కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, కళ్లెం రవీందర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి పలు పాత్రికేయ యూనియన్ల నాయకులు సభ్యులు మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -