ఆరోగ్య రక్షణలో కొత్త అధ్యాయం: హోంగార్డులకు భీమా అవగాహన
చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్ద భారంగా మారకుండా భీమా అవసరం
హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమీక్షా సమావేశం
యాక్సిస్ బ్యాంక్‌తో ఆరోగ్య బీమా అవగాహన కార్యక్రమం
అదనపు డి. సి. పి (ఎ. ఆర్) రామచంద్ర రావు వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాదు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డి. సి. పి (ఎ. ఆర్ ) కె. రామచంద్ర రావు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరంగా చెప్పగా, పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే మార్గాలపై సి. ఎచ్. శ్రావణ్ ప్రతిపాదనలు చేశారు.
ఈ సందర్బంగా అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) రామచంద్ర రావు మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండటం మా మొదటి బాధ్యత. సేవలో నిమగ్నమయ్యే సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్య భీమా మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది. చిన్న సమస్యలు పెద్ద భారం కాకుండా ముందుగానే భీమా తీసుకోవడం ద్వారా కుటుంబాల భవిష్యత్తు పదిలమవుతుంది. మీ ఆరోగ్యం – మీ కుటుంబ ఆనందం. అందరికీ పూర్తి అవగాహనతో, నిర్భయంగా ఆరోగ్య భీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని అదనపు డి.సి.పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ హెచ్. సతీష్ ( హోమ్ గార్డ్స్ ), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ ) , కె. శ్రీనివాస్ ( అడ్మిన్ ) తిరుపతి ( వెల్ఫేర్ ), కార్పొరేట్ శాలరీ మేనేజర్ సి. వెంకటేష్ , బ్యాంక్ అధికారులు , హోంగార్డ్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.


