Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య వివాదం

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య వివాదం

- Advertisement -

మిషన్‌ భగీరథ నీటితో తడిపిన ధాన్యం
రూ.40వేలు ఇస్తేనే కొనుగోలు కేంద్రం పెట్టుకోవాలని డిమాండ్‌
మాజీ ఎంపీటీసీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-గణపురం

బుర్రకాయలగూడెం కొనుగోలు కేంద్రాలపై రాజకీయరంగు అలుముకుంది. అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సాగర్‌.. జీవనజ్యోతి కొనుగోలు కేంద్రం నిర్వాహకుల మధ్య గురువారం వివాదం చోటుచేసుకుంది. రూ.40వేలు ఇస్తేనే కొనుగోలు కేంద్రం పెట్టుకోవాలని ఆంక్షలు విధించడమే కాక తనకు కూడా (ఓడీఎస్‌ఎంఎస్‌) కొనుగోలు కేంద్రం వచ్చిందని, గణపురం వాళ్లు ఇక్కడ సెంటర్‌ పెట్టొద్దంటూ మాజీ ఎంపీటీసీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను బెదిరించారు. తీరా రాత్రికి రాత్రే ఏమైందో కానీ మిషన్‌భగీరథ నీటితో రైతులు ఆరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. దాంతో బుర్రకాయలగూడెం మాజీ ఎంపీటీసీ సాగర్‌పై జీవనజ్యోతి వీవో ఐకేపీ సెంటర్‌ నిర్వాహకులు ఏగోళం శ్రీదేవి, శ్రీపతి అలివేలు, ఆకుల రేణుక, కనుకుంట్ల భద్రమ్మ, మోటపోతుల జయ.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైతులు, జీవనజ్యోతి వీవో కొనుగోలు కేంద్రం నిర్వాహకుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గణపురం గ్రామానికి చెందిన జీవనజ్యోతి వీవోకు కొనుగోలు కేంద్రం మంజూరయింది. ఆ నిర్వాహకులు గణపురంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతులు మీదుగా 20రోజుల క్రితం కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ స్థలం లేకపోవడంతో గణపురం నుంచి బుర్రకాయలగూడెంలో కూడా సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే రైతులు ఆ కల్లాల వద్ద ధాన్యం ఆరబోసుకున్నారు. దాంతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాగర్‌ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్దకు వచ్చి తనకు రూ.40వేలు ఇవ్వాలని, కొనుగోలు కేంద్రం స్థలాన్ని తానే శుభ్రం చేయించానని కేంద్రం నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగాడు. అంతేకాక తనకు (ఓడీఎస్‌ఎంఎస్‌) సెంటర్‌ వచ్చిందని, బుర్రకాయలగూడెంలో మీరు సెంటర్‌ తీసేయాలని ఆంక్షలు విధించాడు. దాంతో సెంటర్‌ నిర్వాహకులు గురువారం ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి ఏమైందో కానీ కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన మాదాసు రవి, ముత్యాల మొగిలి, రాజు తదితర రైతులకు చెందిన 10ఎకరాల ధాన్యం మొత్తం మిషన్‌భగీరథ నీళ్లలో తడిసి ముద్దయింది. శుక్రవారం రైతులు అక్కడికి వచ్చి చూడగా ధాన్యం మొత్తం నీళ్లల్లో తేలాడటంతో రైతులు లబోదిబోమన్నారు. కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం ఇలా కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్‌ కావాలనే మిషన్‌ భగీరథ నీటిని వదిలిపెట్టి తమ ధాన్యాన్ని తడిపించారని తెలిపారు. రెండు కొనుగోలు కేంద్రాల నిర్వహకుల మధ్య జరిగిన వివాదంలో తాము నష్టపోయామన్నారు. మొన్నటి వరకు వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయామని, ఆరబెట్టి తీరా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకు వస్తే ఇక్కడ కూడా ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని వాపోయారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారని, తమకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జీవనజ్యోతి వీవో, ఐకేపీ సెంటర్‌ నిర్వాహకులు మాజీ ఎంపీటీసీ సాగర్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -