Saturday, May 17, 2025
Homeజాతీయంఉరుములు, మెరుపుల వర్షం

ఉరుములు, మెరుపుల వర్షం

- Advertisement -

ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులు
బాపట్లలో పొంగిన వాగులు
గుంటూరులో అంధకారం

విజయవాడ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం, శ్రీకాకుళం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటు కు మత్స్యకారుడు మృతి చెందారు. ప్రకాశంలోని పలు వాగులు పొంగిపొర్లడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. గుంటూరులో విద్యుత్‌వైర్లు తెగిపోవడంతో వరకూ నగరం అంధకారమైంది.
ప్రకాశం జిల్లా శింగరాయకొండలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పాకలలో ఓ ఇంటి మీద పిడుగుపడింది. ఊళ్లపాలెం గ్రామపంచాయతీలోని బిసిన్‌ పల్లెపాలెంలో పిడుగులు పడడంతో రామాలయం గుడిపైన విగ్రహలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఇంకొల్లు-పూసపాడు అడ్డరోడ్డు వద్ద ఉన్న కప్పల వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పర్చూరు-నూతలపాడు మీదుగా ఇంకొల్లుకు-అడ్డరోడ్డుకు రాకపోకలు స్తంభించాయి. యద్దనపూడి మండలంలోని గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి పోలూరు వద్ద వాగు పొంగి ప్రవహించడంతో వింజనంపాడు, పోలూరు గ్రామాలకు-మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మరపాలెం, వింజనంపాడు మధ్య తొండి వాగు ఉధృతంగా ప్రహిస్తుండటంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు.
గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజూమున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో గుంటూరులో తెల్లవారుజూమున రెండు గంటల నుంచి సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గుంటూరులోని కంకరగుంట ఆర్‌యుబి, డొంకరోడ్డు మూడు వంతెనల వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. డుంబ్రిగుడ మండలంలోని కొర్ర పంచాయతీ పరిధి గొందివలస గ్రామంలో భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో వాన పడింది. మెళియాపుట్టిలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ తీర గ్రామమైన వాసాలతిప్పకు చెందిన కర్రి లీలా కృష్ణ (39) గ్రామంలోని చెరువులో చేపలు పడుతుండగా ఆయనకు సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దేవనాపురం పంచాయతీ జగత్‌పల్లి బూర్జిగూడ చెందిన సవర చందర్రావు (28) పొలంలో ట్రాక్టర్‌ దున్నుతుండగా అతనికి సమీపంలో పిడుగుపడింది. అతను అక్కడికక్కడే మరణించారు. పాలకొండ పట్టణంలోని ఎన్‌ఎన్‌ఎన్‌ కాలనీకి చెందిన జోగులక్ష్మి (40) తన ఇంటిపై ఆరబెట్టిన బట్టలు తీసుకునేందుకు వెళ్లిన క్రమంలో వారి ఇంటి సమీపంలో పిడుగుపాటుకు గురై మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -