– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం నర్సాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో వివిధ అంశాలపై ఎస్ఐ అనిల్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎవరైనా పేకాట ఆడితే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
సెల్ ఫోన్ లో వచ్చే ఫేక్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, క్లోనింగ్ వీడియోస్, వాయిస్ పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. గ్రామంలో పాత ఫోన్లు కొంటామని వచ్చిన వ్యక్తులకు ఫోన్లు అమ్మవద్దని తెలిపారు. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మిన, కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటి గణేష్, క్యాషియర్ కట్ట రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్, గ్రామ పంచాయితీ కార్యదర్శి జులేఖ, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



