– మోడీ పాదాలకు మొక్కాలంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
– రేగిన దుమారం..మండిపడిన కాంగ్రెస్
– వ్యాఖ్యలతో వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ నేతలు
భోపాల్: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధ వివరాలను జాతీయ మీడియాకు తెలియచేసిన సైనిక ప్రతినిధుల్లో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం ఇంకా సద్దుమణగక ముందే సైనిక బలగాలను అవమానించే వ్యాఖ్యలతో మధ్య ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్దా మరో వివాదానికి తెర తీశారు. జబల్పూర్‌లో పౌర రక్షణ వలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌కు ప్రధాని మోడీ నాయకత్వం వహించి, ఉగ్రవాదులకు సరైన జవాబు ఇచ్చినందుకు సైనిక బలగాలు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ”ప్రధానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈనాడు యావత్ దేశం, దేశ సాయుధ బలగాలు, సైనికులు అందరూ ప్రధాని నరేంద్ర మోడీ పాదాలకు మొక్కుతున్నారు. ఉగ్రవాదులకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఎంత ప్రశంసించినా సరిపోదు,” అని దేవ్దా వ్యాఖ్యానించారు. పైగా మోడీకి చప్పట్లు కొట్టాలంటూ ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఈ నెల 12న కల్నల్ సోఫియాపై అనవసరపు వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజరు షాపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యాన్ని అవమానించేందుకు బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని మొదలు పెట్టిందంటూ మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారి విమర్శించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను మీడియా ప్రశ్నిస్తే, ఆయన చికాకు పడిపోతూ అర్ధం లేని సమాధానాలు ఇస్తున్నారని పట్వారి విమర్శించారు. విజరు షా తొలగింపునకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు యాదవ్ ఇచ్చిన సమాధానాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఆ ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా బీజేపీ వారికి రక్షణ కల్పిస్తోంది. ఇదంతాచూస్తుంటే బీజేపీ అగ్ర నాయకత్వం సైన్యాన్ని అవమానించే కార్యక్రమం ప్రారంభించినట్లు కనిపిసోతంది.” అని పట్వారి విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడుతుందని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి సుప్రియ శ్రినాటె మాట్లాడుతూ సైన్యాన్ని విమర్శించడమంటే దైవాన్ని విమర్శించడమేనంటూ దేవ్దా వ్యాఖ్యలను దైవ దూషణలతో పోల్చారు. సిగ్గులేకుండా దారుణంగా చేస్తున్న వ్యాఖ్యలను విమర్శించారు. వెంటనే ఉప ముఖ్యమంత్రిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మన సైన్యం చేసినదానికి యావత్ దేశం కృతజ్ఞత చూపుతోంది. కానీ ఉప ముఖ్యమంత్రి చేసిన ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు, మన సైన్యానికి ఈ దేశ ప్రజలు ఇస్తున్న సంపూర్ణ గౌరవాభిమానాలను పూర్తిగా తుడిచిపెట్టేలా వుందని సుప్రియ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సియాచిన్ వంటి మంచు కొండల నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు సైనికులు మనలను పహరా కాస్తున్నారు. ఇటువంటి ప్రకటన చేయడమంటే సైన్యాన్ని అవమానించడమేనని అన్నారు. ఏ భారతీయుడు కూడా ఇలా మాట్లాడడాన్ని సహించబోరని అన్నారు. ఈ ప్రకటనను మేం సాదా సీదాగా తీసుకోలేం, కచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేసిన దేవ్దాను ప్రధాని మోడీ తొలగించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఆయన అలా చేయలేకపోతే, ఆయన అనుమతితోనే ఇదంతా జరిగిందని, అందుకే ఆయన కాపాడుతున్నారని మేం అనుకోవాల్సి వస్తుందని అన్నారు.
దేవ్దా వివరణ
తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వివాదం రేగడంతో దేవ్దా వివరణ ఇచ్చారు. తన ప్రకటనలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని విమర్శించారు. తప్పుడు పద్ధతిలో వాటిని ప్రచారం చేస్తోందన్నారు. సాయుధ బలగాలను అవమానించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ తనపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదులపై మన సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు, తెగువను ఎంత పొగిడినా తక్కువేనని తన ప్రసంగంలో పేర్కొన్నానని దేవ్దా చెప్పారు. ఇందుకు గానూ యావత్ దేశం, దేశ ప్రజలు వారి పాదాలకు మొక్కాల్సిందేనని, వారికి నమస్కరించాల్సిందేనని, తాను కూడా వారికి శాల్యూట్ చేస్తున్నానని అన్నట్లు చెప్పారు. సైన్యాన్ని ప్రశంసించాలన్నదే తన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పే వ్యాఖ్యలేవీ చేయలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని అన్నారు. తన ప్రసంగాన్ని వక్రీకరించడం ద్వారా కాంగ్రెస్ ఈ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు. తన ప్రకటనను, వ్యాఖ్యలను సరిగ్గా చూడాల్సిందిగా మీడియాను ఆయన కోరారు. ‘ఒకరి పదాలను, భావాలను మీరు వక్రీకరిస్తే అది కూడా తప్పే, అన్యాయమే.” అని ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు.
సైనిక బలగాలకు అవమానం
- Advertisement -
- Advertisement -