Saturday, November 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనక్కి తగ్గిన ట్రంప్‌

వెనక్కి తగ్గిన ట్రంప్‌

- Advertisement -

బ్రెజిల్‌కు భారీ ఊరట
ఆహార ఉత్పత్తులపై 40 శాతం సుంకాల తొలగింపు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. బ్రెజిల్‌ ఆహార ఉత్పత్తులపై జులైలో విధించిన 40 శాతం సుంకాలను తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం ఫలితంగా బ్రెజిల్‌ వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించిందని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో బ్రెజిల్‌ నుంచి అమెరికాకు కాఫీ, బీఫ్‌, కోకో, పండ్ల ఎగుమతులకు మళ్లీ పెద్ద ఎత్తున దారులు తెరుచుకోనున్నాయి. తాజా పరిణామం అమెరికా ఒత్తిడుల ముందు బ్రెజిల్‌ వ్యవసాయ రంగం ప్రదర్శించిన ధైర్యానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా రాజకీయ ప్రయోజనాల కోసం విధించిన ఈ భారీ సుంకాల తగ్గింపుతో ప్రపంచ వాణిజ్యంలో బ్రెజిల్‌ ప్రాధాన్యం మరోసారి నిరూపితమైందని వివరిస్తున్నారు. ట్రంప్‌ విధించిన 40 శాతం సుంకాలను ఎత్తివేయటంతో గత నాలుగు నెలలుగా బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థపై అమెరికా పెట్టిన ఒత్తిడి ముగిసినట్టయ్యింది.

జైర్‌బోల్సోనారో వ్యవహారంపై రాజకీయ కారణాలతో వేసిన ఈ భారీ సుంకాలు.. బ్రెజిల్‌ వ్యవసాయ రంగాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలని బ్రెజిల్‌ నాయకత్వం ఆది నుంచీ విమర్శిస్తోంది. బ్రెజిల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఉన్నది. అమెరికాకు మూడువంతులు బ్రెజిల్‌ నుంచే చేరతాయి. అలాగే బీఫ్‌ తయారీకి ఉపయోగించే ప్రత్యేక బీఫ్‌ రకాన్ని అమెరికాకు ప్రధానంగా బ్రెజిల్‌ సరఫరా చేస్తుంది. అలాంటి కీలక ఉత్పత్తులపై ట్రంప్‌ 40 శాతం సుంకం విధించటంతో అమెరికాలో కాఫీ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ట్రంప్‌నకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇది ఆయన అప్రూవల్‌ రేటింగ్‌ను తగ్గించింది. చివరకు ఇవన్నీ అమెరికాకు, ట్రంప్‌ ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో అమెరికాలో వినియోగదారుడి ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్‌ సుంకాలను తొలగించాల్సి వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. తమ వాణిజ్య బలం మళ్లీ రుజువైందని బ్రెజిల్‌ స్పందించింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా కూడా అమెరికా నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా వాణిజ్య ఒత్తిడులు బ్రెజిల్‌ను కదిలించలేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -