ఖమ్మం సీపీకి అఖిలపక్షం నేతల వినతిపత్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను తక్షణమే అరెస్టు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నాయకులు సామినేని రామారావును ఆయన ఇంటి వద్దనే కొట్టంలో హత్య చేశారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతోపాటు మరికొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారని రామారావు భార్య స్వరాజ్యం ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీని కలిసి వినతిపత్రం సమర్పిం చిన నేతల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, న్యూడెమోక్రసీ నాయకులు ఉన్నారు.



