మాతృభాషకు రూ. 150 కోట్లు
కేంద్ర తీరుపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు
చెన్నై : సంస్కృతం అభివృద్ధికి రూ 2,400 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తమిళభాషాభివృద్ధికి మాత్రం రూ. 150 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ తమిళ అభివృద్ధికి కేవలం రూ. 150 కోట్లు కేటాయించిన కేంద్రం.. దీనికి విరుద్ధంగా ‘చనిపోయిన భాష’ అయిన సంస్కృతానికి రూ. 2,400 కోట్లు కేటాయించిందని చెప్పారు. తమిళనాడు అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం మొసలి కన్నీరు కారు స్తుందని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్ వంటి చిన్న నగరాలకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన మోడీ ప్రభుత్వం, తమిళనాడులోని కోయంబత్తూరకు మాత్రం అనుమతి నిరాకరిస్తుందని స్టాలిన్ గుర్తుచేశారు. బీజేపీ, అన్నాడీఎంకేలు తమిళనాడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు టి. సెంథిల్‌వేల్ రచించిన ‘ద్రవిడం 2.0- ఎందుకు? దేనికి?’ అనే పుస్తకాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. మొదటి కాపిని పాఠశాల విద్యా మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళీ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘కలైంజర్ 2.0 స్థాయి సుపరిపాలన’ను అందిస్తుందని ప్రశంసించారు.



