Saturday, November 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసంపన్నులపై భారీగా పన్నులు వేయాలి

సంపన్నులపై భారీగా పన్నులు వేయాలి

- Advertisement -

అసమానతల నివారణకు ఇదే పరిష్కారం
మా భవిష్యత్‌ గురించి మాట్లాడని జీ20 ఎందుకు?
నిరసనకారుల ఆగ్రహం
ఆందోళనల వలయంలో జోహన్స్‌బర్గ్‌
దక్షిణాఫ్రికాలో తొలి జీ20 సదస్సు

జోహన్స్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పలు అంశాల్లో నిరసన గళం వినిపించటానికి ఆందోళనకారులు సిద్ధమవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి సంపన్నులకా లేక సాధారణ ప్రజలకా అని పేదలు, కార్మికులు, మహిళలు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తు న్నారు. ఇలాంటి తరుణంలో అక్కడి ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. 3,500 మంది అదనపు పోలీసులను మోహరిం చింది. సైనిక దళాల ప్రదర్శనను నిర్వహించింది. హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. అయితే ఆఫ్రికాలోనే తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు పలువురు అంతర్జాతీయ నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు.

మా భవిష్యత్తు గురించి మాట్లాడని జీ20 ఎందుకు?
ఈ సదస్సును పలువురు నిరసనకారులు తమ డిమాండ్లను వినిపించే ఒక వేదికగా మలుచుకుంటున్నారు. జీ20 సదస్సుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పేదలు, కార్మికులు, మహిళలు, యువత.. వీరంతా చెప్తున్నది ఒకటే.. ‘జీ20 ధనికుల విందు.. కానీ బాధ మాత్రం పేదలదే’ అని. దక్షిణాఫ్రికాలో అసమానతలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ పది శాతం సూపర్‌రిచ్‌ (అతి సంపన్నులు) దేశ సంపదలో 85 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇక మిగిలిన జనాభా కేవలం బతకడానికి పోరాడుతుండటం ఇక్కడి ఆందోళనకర పరిస్థితిని తెలియజేస్తున్నది. ఇక నిరుద్యోగం 31 శాతంతో ప్రపంచంలోనే అత్యధికం కావటం గమనార్హం. ఇంతటి అసమానతల నేపథ్యంలో పలువురు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అతి సంపన్నులపై పెద్ద మొత్తంలో పన్నులు విధించాలని డిమాండ్‌ వినిపిస్తున్నారు.

అసమానతలను దూరం చేసేందుకు ఇదే పరిష్కారమని అంటున్నారు. సూపర్‌రిచ్‌లు పన్నుల నుంచి తప్పించుకుంటే.. దేశాన్ని పేదలు నడపాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ నాయకులు దేశానికి చేరుతున్న సమయంలో తమ స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలియజేసే హక్కు ఉన్నదనీ, అది చట్టపరిమితికి లోబడి ఉండాలని లెఫ్టినెంట్‌ జనరల్‌ మోసికిలీ అన్నారు. సదస్సు వేదిక చుట్టూ నిరసనకారుల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. జోహెన్స్‌బర్గ్‌తో పాటు దక్షిణాఫ్రికాలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలను జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థను వ్యతిరేకించేవారు, మహిళా హక్కుల సంఘాలు, వలస వ్యతిరేక గ్రూపులు, పర్యావరణ కార్యకర్తల నుంచి నిరసనలు పెద్ద ఎత్తునే జరుగుతాయని భావిస్తున్నారు.

మహిళలు పనికి వెళ్లకుండా శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని ‘ఉమెన్‌ ఫర్‌ చేంజ్‌’ అనే మహిళా హక్కుల సంఘం పిలుపునిచ్చింది. ప్రతి రెండున్నర గంటలకు ఒక మహిళ హత్యకు గురవుతున్న దేశంలో పురోగతి గురించి మాట్లాడటానికి జీ20కి హక్కు లేదని ఆ సంఘం వివరించింది. ఇక వాతావరణ మార్పు, సంపదలో అసమానతలపై పని చేసే పలు సంఘాల కూటమి.. గురువారం నుంచి నగరంలోని మరో ప్రాంతంలో సదస్సును నిర్వహిస్తోంది. జీ20 అనేది ధనవంతుల కోసమేనని ఆరోపించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతి ఆఫ్రికనర్లపై వర్ణ వివక్షా విధానాలు, దాడులు చేస్తున్నదని ఆరోపిస్తూ జీ20 సదస్సును బహిష్కరించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -