Saturday, November 22, 2025
E-PAPER
Homeజాతీయంరూపాయి చారిత్రాత్మక పతనం

రూపాయి చారిత్రాత్మక పతనం

- Advertisement -

డాలర్‌తో పోల్చితే 89.61కి క్షీణత
ఒక్క పూటలోనే 93 పైసలు ఢమాల్‌

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ కుప్పకూలిపోయింది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో వారాంతంలో 89.61కి పతనమయ్యింది. అమెరికా, భారత్‌ మధ్య చోటు చేసుకుంటున్న టారిఫ్‌ ఆందోళనలు, దేశీయ, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో ఒత్తిడి రూపాయి విలువను అగాథంలోకి నెట్టింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భారత ఐటి కంపెనీలకు ప్రతికూల నిర్ణయాలు ఉండొచ్చనే భయాలతో ఐటీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కోవడ మూ రూపాయిపైనా ప్రభావం చూపాయి. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 93 పైసలు పతనమై 89.61 దిగజారింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో ఉదయం 88.67 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 89.65 అత్యల్ప స్థాయికి పడిపోయింది. గురువారం సెషన్‌లోనూ 20 పైసలు విలువ కోల్పోయింది. ఇంతక్రితం సెప్టెంబర్‌ 30న ఇంట్రాడేలో 88.85 కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్‌ 14న 88.81 ఆల్‌టైం పతనాన్ని చవి చూసింది. ఆ తర్వాత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఒకే పూటలో అత్యధికంగా జులై 30న 89 పైసలు క్షీణించింది.

‘ఇప్పటి వరకు భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రాకపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లలో విశ్వాసం సన్నగిల్లింది. క్రిప్టో కరెన్సీల్లో భారీగా అమ్మకాలు తదితర అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌లో కరెన్సీ, రీసెర్చ్‌ హెడ్‌ అనింద్య బెనర్జీ పేర్కొన్నారు. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరిగిపోనుంది. భారత్‌పై అమెరికా వేసిన భారీ టారిఫ్‌లకు తోడు, విదేశీ నిధుల బయటకు తరలిపోవడం, డాలర్ల కొనుగోళ్లకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో మోడీ సర్కార్‌ విఫలం కావడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీని అగాథంలోకి నెట్టుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వారాంతం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 401 పాయింట్లు లేదా 0.47 శాతం పతనమై 85,232కు జారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 124 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 26,068 వద్ద ముగిసింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో ఉండాలన్న దానిపై ఏ లక్ష్యం పెట్టుకోలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లతో తలెత్తిన వాణిజ్య అనిశ్చితి పరిస్థితులతోనే రూపాయి ఒత్తిడికి గురి అవుతుందన్నారు. రూపాయి అనేది ఓ ఆర్థిక సాధనమని, డాలర్లకు డిమాండ్‌ ఉన్నప్పుడు రూపాయి విలువ తగ్గడం సాధరణమేనని వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -