బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి
ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారు
ప్రాణాలు తీసే అధికారం పాలకులకెవరిచ్చారు?
అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలో వామపక్ష, పౌరహక్కుల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపేయాలనీ, దండకారణ్యంలోని సహజవనరులను కార్పొరేట్లకు అప్పగించడాన్ని విరమించుకోవాలని వామపక్ష పార్టీల, పౌరహక్కుల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. కేంద్రంలోని మోడీసర్కారు మావోయిస్టుల ఏరివేత పేరుతో మనుషులను ఊచకోత కోస్తుంటే సుప్రీం కోర్టు మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. వెంటనే బూటకపు ఎన్‌కౌంటర్లను సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని న్యాయస్థానాలను కోరారు. ఈ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేస్తామని ప్రకటించారు.
మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా చంపడాన్ని ఖండిస్తూ ‘బూటకపు ఎన్‌కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేదర్కర్ విగ్రహం వద్ద వామపక్షపార్టీల నేతలు, ప్రజా, పౌరసంఘాల నేతలు, మేధావులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ”ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే.. ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలి…అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించొద్దు… మావోయిస్టులతో చర్చలు జరపాలి…’ అని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే తాము దేశ ద్రోహులమా? ప్రజాధనాన్ని, దేశ ఖనిజ సంపదను దోచుకుని వేలకోట్ల రూపాయలకు ఎదిగే అంబానీ, అదానీలు దేశభక్తులా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
మావోయిస్టులను చంపినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదనీ, వారు అలా కావడానికి గల కారణాలను విశ్లేషించి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పట్ల చాలా మంది మూగ వేదనకు ప్రతీకగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల ప్రశ్నించినందుకు తనపైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల సోషల్‌మీడియా అసత్యప్రచారాలు చేయడం, చంపుతామంటూ బెదిరించడం వంటి పరిణామాలను చూస్తుంటే అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం వ్యక్తమవుతున్నదన్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని కూనంనేని హెచ్చరించారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ…ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత కమ్యూనిస్టులు, ప్రజా తంత్ర వాదులు, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజంపైన ఉందన్నారు. దమ్ముంటే 2026 మార్చి నాటికి దేశంలో అవినీతిని నిరోధిస్తామనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామనీ, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేస్తామని అమిత్‌షా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, జస్టిస్(రిటైర్డ్) చంద్రకుమార్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వర్లు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ లక్ష్మణ్, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, సీపీఐ(ఎంఎల్)చంద్రన్న గ్రూప్ నాయకులు భాస్కర్, తదితరులు మాట్లాడుతూ… ప్రజాస్వామిక స్వభావానికి బూటకపు ఎన్‌కౌంటర్లు గొడ్డలిపెట్టులాంటివన్నారు.
అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడంలో భాగంగానే ఆదివాసీలను, వారికి అండగా ఉంటున్న మావోయిస్టులను అడవులనుంచి బయటకు వెళ్లగొడుతున్నారని చెప్పారు. దండకారణ్యంలో అపార ఖనిజ వనరులున్న 1600 ఎకరాల భూమిని రూపాయికి ఎకరం చొప్పున ఆదానీకి అప్పగించడం దుర్మార్గమన్నారు. కేంద్రం టార్గెట్ పెట్టాల్సింది పేదరికం, అవినీతి, రైతులు ఆత్మహత్యల నివారణపై అని సూచించారు. బూటకపు ఎన్‌కౌంటర్లను పౌర సమాజం ప్రశ్నించాలనీ, లేకపోతే, భవిష్యత్తులో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నిస్తే ఇంట్లోనే ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.ఇప్పటివరకూ పట్టుకున్న మావోస్టులను వెంటనే అరెస్టుగా చూపి కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ్మ, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.వెంకటేశ్, బాబూరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చలపతిరావు, పీఓడబ్య్లు నాయకురాలు సంధ్య, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
మార్చి 26 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి అమిత్‌షా మాట్లాడటమే రాజ్యాంగ, చట్ట వ్యతిరేకం. అసలు మనుషులను చంపే హక్కు వీరికి ఎవరిచ్చారు. తాము చర్చలకు సిద్ధమనీ, ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టులు ప్రకటించిన తర్వాత పట్టుకొచ్చి చంపేయడం దుర్మార్గం. బూటకపు ఎన్‌కౌంటర్లను ప్రతిఒక్కరూ ఖండించాలి. ఆపరేషన్ కగార్ వెనుక దేశ ఖనిజవనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాగి ఉన్నది. కేంద్రం వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి. -సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ



