– మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి చట్టం ‘భూ మేత’ అయ్యిందా?అని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భూ భారతి.. భూ హారతిగా మారిందా?, కాంగ్రెస్ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా? అడిగారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని తెలిపారు. కాంగ్రెస్ తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు చెత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న వరుస ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. మొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో అన్నదమ్ములు ఆందోళనకు దిగారని గుర్తు చేశారు. నిన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే మూడు నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూసమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమైందని అడిగారు. ప్రజా పాలన, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700కు పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేల్కొని పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలనీ, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని డిమాండ్ చేశారు.
భూభారతి… భూమేత అయ్యిందా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



