కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతర్
29 కార్మిక చట్టాల్ని రద్దు చేసిన మోడీ సర్కార్
కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్ కోడ్స్
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఐదేండ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం అప్పటినుంచి కార్మికుల ఆగ్రహజ్వాలలకు భయపడుతూ వెనకడుగు వేస్తూ వచ్చింది. బీహార్‌లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాల అమలు వేగవంతమైంది. దానిలోభాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెస్తూ శుక్రవారం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణం ఈ కోడ్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రతా కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (2020)లు ఇక అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ : ”2020లో పార్లమెంట్ ఆమోదించిన కార్మిక చట్టాలకు చెందిన నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తీసుకొచ్చాం. స్వాతంత్య్రా నంతరం చేపట్టిన సమగ్ర కార్మిక, ప్రగతిశీల కార్మిక సంస్కరణల్లో ఇది ఒకటి. ఈ కోడ్‌లు మన కార్మికుల కు మరింత సాధికారత కల్పిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సులభతరం చేస్తూ, ప్రగతి బాటన నడుస్తాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియా కూడా ఈ కోడ్‌లను సమర్థిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ కోడ్‌ల లక్ష్యం 2047 నాటికి భారత దేశాన్ని సంపన్న దేశంగా ఆవిర్భవింపచేయడమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయనీ రాసుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని జాతీయ కార్మిక సంఘాలు, కార్మికరంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ కోడ్‌లు అమల్లోకి వస్తే కార్మికులు సమ్మె హక్కుతోపాటు అనేక ప్రయోజ నాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ల కోసమే…
కార్పొరేట్ సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అందించడం, ఫలితంగా వారు మరిన్ని ఆర్థిక లాభాలను గడించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ కోడ్‌ల అమలు వల్ల కార్మికుల పని గంటలు పెరుగుతాయి. అసంఘటిత రంగ కార్మికులకు చట్టపరిధిలో లభించే హక్కులు హరించబడతాయి. అలాగే లేబర్ కోడ్‌లలో ‘వేతనాలు’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. బోనస్, ఇంటి అద్దె అలవెన్స్, రవాణా భత్యం, కమిషన్ మొదలైన ప్రయోజనాలను వేతనాల నిర్వచనం నుంచి మినహాయించారు. దానితోపాటు మొత్తం వేతనంలో ఈ మినహాయింపులు 50 శాతం దాటరాదని షరతు విధించారు. గ్రాట్యుటీ, రిట్రెంచ్‌మెంట్ పరిహారాన్ని దీనిలో చేర్చలేదు.
గ్రాట్యుటీ గోల్‌మాల్
గ్రాట్యుటీకి అర్హత పొందగోరే ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఏడాదికి తగ్గిం చారు. అంటే ఉద్యోగులు ఒక సంవత్సరం పాటు సర్వీసులో ఉంటే వారికి గ్రాట్యుటీ లభిస్తుంది. అయి తే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. నిర్దిష్ట కాలానికి నియమించబడే ఉద్యోగులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగులకు గతంలో మాదిరే ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యుటీ లభిస్తుంది.
ఆర్థికవృద్ధిపైనే దృష్టి
సంపద పంపిణీ చేయకుండా ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తే నిరుద్యోగం పెరుగుతుందనే వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా పారిశ్రామికవర్గాలు, కార్పొరేట్లు శ్రమశక్తిని యధేచ్ఛగా దోచుకొనేందుకు మార్గం సుగమం చేసినట్టు అవుతోంది.
ఔట్‌సోర్సింగే…
”ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లారుమెంట్” నిబంధనలతో తక్కువ కాల వ్యవధికి కార్మికులను నియమించడం సులభమవుతుంది. నెలల కొద్దీ పని చేసి, పింఛను, గ్రాట్యుటీ, ప్రమోషన్ అవకాశాలు లభించవు. కార్మికులు ఎప్పటికీ ఔట్‌సోర్సింగ్‌లోనే ఉండిపోతారు.
సామాజిక భద్రత లేదు
అసంఘటిత రంగ కార్మికులకు (గిగ్ వర్కర్లు, డెలివరీ బార్సు, ఆటో డ్రైవర్లు మొదలైన వారు) ఇచ్చే భద్రతా పథకాలకు నిధుల మూలాలు, అమలు ప్రణాళికలపై స్పష్టత లేదు. ఫలితంగా నిజమైన కార్మికులు అనేక ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ‘సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే నిరసన, ఉల్లంఘన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కార్మిక లోకాన్ని కోరుతున్నాం. పని ప్రదేశంలో ఇప్పటి నుంచే నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాం. సోమవారం నుంచి గేటు సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, బస్తీ సమావేశాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకూ దేశంలోని కార్మికులు గట్టి పోరాటం చేస్తారని కేంద్ర కార్మిక సంఘాల వేదిక ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది’ అని ఆ ప్రకటన తెలియజేసింది. కాగా ఈ ప్రకటనపై ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యుఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ నేతలు సంతకాలు చేశారు.
హక్కులకు పరిమితులు
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ద్వారా కార్మికులకు లభిస్తున్న రక్షణ హక్కులు, కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్‌లతో హరించుకుపోతాయి. ఉద్యోగ భద్రత కరువవుతుంది. కార్మికులు సమ్మె చేయాలంటే 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. మహిళలు, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల నిర్దిష్ట అవసరాలను పట్టించుకునే క్లాజులు ఏవీ లేబర్ కోడ్‌లలో లేవు. చిన్న చిన్న సంస్థలలో పని చేసే వారికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి రక్షణ చర్యల్ని సిఫార్సు చేయలేదు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, అసమానతలను నివారించేందుకు లేబర్ కోడ్‌లలో ఎలాంటి చర్యలు లేవు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు అందే పరిస్థితులు లేవు. ఇ-రిజిస్ట్రేషన్, ఆధార్‌తో ముడిపడిన ప్రయోజనాలు డిజిటల్ పరిజ్ఞానం లేని కార్మికులకు ప్రతిబంధకంగా మారతాయి.
తనిఖీల్లేవ్
కార్మికుల సంఖ్య పదిమందికంటే తక్కువ ఉన్న యూనిట్లను తనిఖీల నుంచి మినహాయించారు. దీనివల్ల పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు మరింత హీనస్థాయికి చేరే ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదాలు, యంత్ర భద్రతా ప్రమాణాలపై బాధ్యత లేకుండా పోతుంది.
ఉద్యోగ భద్రత లేదు
పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో 300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థల్లో వారి తొలగింపులపై ఎలాంటి నియంత్రణలు లేవు. ఫలితంగా శాశ్వత ఉద్యోగాల కంటే ఒప్పంద (కాంట్రాక్ట్) విధానం మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు పైబడిన ఉద్యోగులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది.
కార్మిక సంఘాలతో చర్చించలేదు
కార్మిక కోడ్‌లను రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో పాటు ఇతర భాగస్వాములను సంప్రదించలేదు. పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాల అనుకూల నిర్ణయాలతో ఈ చట్టాలను రూపొందించారు. సామాజిక భద్రతా కోడ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతల ప్రస్తావనలు గందరగోళంగా ఉన్నాయి. ఇవి చట్టంలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.



