Saturday, November 22, 2025
E-PAPER
Homeజాతీయంఏకపక్షనిర్ణయం తగదు : కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక

ఏకపక్షనిర్ణయం తగదు : కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల కార్మిక కోడ్‌లను గుడ్డిగా, ఏకపక్షంగా అమలు చేయడాన్ని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక తీవ్రంగా ఖండించింది. దీన్ని మోసపూరిత చర్యగా అభివర్ణించింది. లేబర్‌ కోడ్‌లను అప్రజాస్వామికంగా నోటిఫై చేయడం ద్వారా కేంద్రం అన్ని ప్రజాస్వామిక సూత్రాలను కాలరాసిందనీ, భారతదేశ సంక్షేమ రాజ్య స్వభావాన్ని నామరూపాలు లేకుండా చేసిందని మండిపడింది. ఈ మేరకు పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర పారిశ్రామిక సమాఖ్యలతో కూడిన సంయుక్త వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో క్రూరమైన లేబర్‌ కోడ్‌లను అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న రోజు నుంచే మేము దీనిని ప్రతిఘటించాలని నిర్ణయించాం. వేతన కోడ్‌ను 2019లో ఆమోదించినప్పుడు వెంటనే నిరసనలు చేపట్టాము.

2020 జనవరిలో సార్వత్రిక సమ్మెను నిర్వహించాం. మిగిలిన మూడు కోడ్లను ఆమోదించినప్పుడు కూడా ఇలాగే నిరసన తెలిపి 2020 నవంబరు 26న చారిత్రక దేశవ్యాప్త సమ్మె జరిపాము. సంయుక్త కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో ఢిల్లీ ఛలో కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ తర్వాత కార్మిక సంఘాలన్ని కలిసి ఉమ్మడిగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ ఏడాది జూలై 9న సార్వత్రిక సమ్మె జరిగింది. ఇందులో ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికుల భాగస్వాములై సమ్మెను విజయవంతం చేశారు’ అని ఆ ప్రకటనలో తెలిపారు. ‘కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ బీహార్‌ ఎన్నికలలో లభించిన విజయంతో మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్ల అమలుకు పూనుకుంది. లేబర్‌ కోడ్‌లపై చర్చించేందుకు ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ను (ఐఎల్‌సీ) వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక గతంలోనే కోరింది.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ నెల 13న ముసాయిదా శ్రమ శక్తి నీతిపై సమావేశాన్ని నిర్వహించినప్పుడు కూడా లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌పై ముందస్తు సంప్రదింపుల కోసం ఈ నెల 20న ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైతం కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని, ఐఎల్‌సీని ఏర్పాటు చేయాలని సంయుక్త వేదిక తరఫున కోరడం జరిగింది. అయితే ఈ విజ్ఞాపనలలో వేటికీ ప్రభుత్వం స్పందించలేదు’ అని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక తన ప్రకటనలో విమర్శించింది. ‘కార్మిక సంఘాలు ఎన్ని అభ్యర్థనలు చేసినా, నిరసనలు వ్యక్తం చేసినా, సార్వత్రిక సమ్మెలు నిర్వహించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్లను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

బడ్జెట్‌కు సన్నాహకంగా నిర్వహించిన సమావేశంలో యాజమాన్యాలు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీఎమ్‌ఎస్‌, ఇతర సంఘాల ప్రతినిధుల డిమాండ్‌కు తలవంచింది. ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికం. అది తిరోగమన చర్య. కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. కార్మిక లోకంపై జరిగిన ఈ దాడిని సంఘటితంగా ఎదుర్కొంటాం. కార్మికుల ప్రాణాలతో, వారి జీవితాలతో చెలగాటం ఆడడాన్ని ముక్తకంఠంతో నిరసిస్తున్నాం. ప్రభుత్వ చర్య కార్మికుల బానిసత్వంలోకి నెట్టడానికి, వారి హక్కులను లాగేసుకోవడానికి ఉద్దేశించింది. కార్మిక కోడ్లను అమలు చేసిన పక్షంలో రాబోయే తరాల ఆశలు, నమ్మకాలు, ఆకాంక్షలు కూర్తిగా ఆవిరైపోతాయి’ అని సంయుక్త వేదిక తన ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -