సహ వ్యవస్థాపకుడినిఅరెస్టు చేసిన ఈడీ
స్వతంత్ర మీడియాపై ప్రభుత్వ ఒత్తిడి
ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని విమర్శించిన కాంగ్రస్
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ప్రముఖ వార్తాపత్రిక ‘గుజరాత్ సమాచార్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన బాహుబలిషాను ఈడీ అదుపులోకి తీసుకుంది. గురువారం రాత్రి అహ్మదాబాద్‌లోని బాహుబలిషా కార్యాలయ ప్రాంగణంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున అతన్ని అరెస్టు చేశారు. గుజరాత్ సమాచార్‌ను నడిపే లోక్‌ప్రకాశన్ లిమిటెడ్ డైరెక్టర్లలో బాహుబలిషా ఒకరు. ఆయన సోదరుడు శ్రేయాన్ష్ షా పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున బాహుబలిషాను ఈడీ అదుపులోకి తీసుకుందని శ్రేయాన్ష్‌షా నిర్వహిస్తున్న గుజరాతీ వార్తా చానల్ జిఎస్‌టివిలో డిజిటల్ సేవల చీఫ్ తుషార్ దేవ్ పేర్కొన్నారు. ఈడీ షాను మొదట వి.ఎస్.ఆస్పత్రికి తీసుకువెళ్లిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిన అనంతరం నగరంలోని జైడస్ ఆస్పత్రికి తరలించిందని అన్నారు. ఈ అరెస్టుపై ఈడీి ఇంత వరకూ స్పందించలేదు. బాహుబలిషా అరెస్టుపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్రంగా స్పందించారు. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని తెలిపారు. ‘ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించి, బిజెపితో రాజీపడని వారు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని కూడా ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ ’93 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వార్తాపత్రిక ఒక ధైర్యమైన వ్యతిరేక స్వరం. చక్రవర్తి నగంగా ఉన్నాడని బహిరంగంగా చెప్పే ధైర్యం ఉన్న వారి గతి ఇది’ అని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ ఈ అరెస్టుపై స్పందిస్తూ ‘ గుజరాత్ సమాచార్ ఎల్లవేళలా చూపించిన ధైర్యాన్ని మేం అభిమానిస్తాం. ఇలాంటి మీడియా సంస్థల యజమానులను వేధించడం కేవలం ‘మంత్రగత్తె వేట’ వంటిది. చివరికి వీరంతా నిజాయితీగా బయటపడతారు’ అని అన్నారు.ఈడీ చర్యపై కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీ మండిపడ్డారు. అనేక ఏళ్లుగా గుజరాత్ సమాచార్ నిరంతరం వార్తలను అందిస్తోందని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నివేదికలను ప్రచురిస్తున్నందున పత్రికను, యజమానులను ఈడీ లక్ష్యంగా చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే కుట్ర : రాహుల్‌గాంధీ
గుజరాత్ సమాచార్ సహ వ్యవస్థాపకుడు బాహుబలి షాను నిర్బంధించడం దేశ ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే కుట్రగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. దేశాన్ని దండన లేదా భయంతో నడపలేరని, సత్యం, రాజ్యాంగంతో భారత్ పరిపాలించబడుతుందని శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధికారాన్ని జవాబు దారీగా ఉంచే వార్తాపత్రికలను మూసివేయడమంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోవాలని అన్నారు. గుజరాత్ సమాచార్‌ను నిశ్శబ్దం చేసే ప్రయత్నం కేవలం ఆ ఒక్క వార్తాపత్రిక గొంతునే కాదు, మొత్తం ప్రజాస్వామ్యం గొంతును అణచివేసేందుకు చేసిన మరో కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గుజరాత్ సమాచార్’ పైబీజేపీ సర్కార్ కన్నెర్ర
- Advertisement -
- Advertisement -