రాజ్‌భవన్ వైపు మార్చ్
లాఠీచార్జి, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం
ఇంఫాల్ :శాంతి, స్వేచ్ఛా కదలికల కోసం మణిపూర్‌లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజధాని ఇంఫా ల్‌లో జరిగిన మార్చ్‌ను భద్రతా సిబ్బంది లాఠీ చార్జి, టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించి చెదరగొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆందోళనకారు లు రాజ్‌భవన్ వైపు మార్చ్‌గా వెళుతుండగా మార్గమధ్యలో భద్రతాసిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. ఆందోళనకారులు ఈ బారికేడ్లను దాటి వెళ్లడానికి ప్రయత్నించగా వారిపై సిబ్బంది లాఠీచార్జి చేశారు. కాగా, రెండేండ్లుగా నిలిచిపోయిన మణిపూర్ సంగై ఫెస్టివల్‌ను ఈ ఏడాది నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఫెస్టివల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ ఆందోళనలు జరిగాయి. ఇలాంటి వేడుకల కన్నా ముందుగా హింసాకాండతో నిరాశ్రయులైన ప్రజలను వారి వారి ఇండ్లకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని, మణిపూర్ అంతటా శాంతిని, సాధారణ స్థితిని తిరిగి స్థాపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే ప్రజల గొంతుకలను బలవంతంగా అణిచివేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మణిపూర్ సంగై ఫెస్టివల్ అనేది రాష్ట్రంలో అతిపెద్ద పర్యాటక ఉత్సవం. చివరిసారిగా దీన్ని 2022లో నిర్వహించారు. 2023, 2024ల్లో హింసాకాండ కారణంగా దీన్ని నిర్వహించలేదు.అయితే ఈ ఏడాది నవంబర్ 21 నుంచి 30 వరకూ 10 రోజుల పాటు దీన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉత్సవానికి మద్దతు ఇవ్వాలని మణిపూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పునీత్ గోయల్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు.



