మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట హైస్కూల్లో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన
నవతెలంగాణ-సిద్ధిపేట
పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది ‘సైన్స్ ఫెయిర్’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో బాలికల హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచమంతా స్టార్టప్ యుగం నడుస్తోందని, డిగ్రీ, బీటెక్ విద్యార్థులు మంచి మంచి ఆవిష్కరణలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమని, కరెంట్, టెలిఫోన్ లాంటివి అన్నీ ఇన్నోవేషన్ నుంచి వచ్చినవే అని అన్నారు. ఇన్నోవేషన్‌కు ఆకాశమే హద్దు అని, నిరంతర ప్రక్రియ అని, కంప్యూటర్ పోయి ఏఐ వచ్చిందని చెప్పారు. విద్యార్థుల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలని, ఆ ఆలోచనలకు ప్రతి రూపం ఇన్నోవేషన్ అని, మనకు మనం తక్కువ అంచనా వేసుకోకూడదని సూ చించారు. ప్రతి విద్యార్థిలో సైంటిస్ట్, ఇంజినీర్ ఉంటాడని, సైంటిస్ట్ కూడా ఒక విద్యార్థి అన్నారు. సైన్స్‌ఫెయిర్ విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని అందిస్తుందని, మనిషి లో ఉత్సాహం లేకపోతే ఓటమితో సమానమని చెప్పారు. మనిషిలో ప్రోత్సాహం, ఉత్సాహం ఉండాలని, మన రాష్ట్రంలో అత్యుత్తమ సైన్స్ ఫెయిర్ సిద్దిపేటకు వచ్చిందని తెలిపారు. వచ్చే టెన్త్ పరీక్షల్లో సిద్దిపేట మొదటి మూడు స్థానాల్లో నిలవాలని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయని, డీఏలు, రిటైర్మెంట్ పైసలు రావట్లేదు, డీఈవోలు లేరు.. పీఆర్సీ రాలేదని హరీశ్‌రావు అన్నారు. 33 జిల్లాకు 33 డీఈఓలలో ముగ్గురే రెగ్యులర్‌గా ఉన్నారని, ఇతర శాఖల వారికి ఈ బాధ్యతల అప్పగించడం సరికాదన్నారు. ఇలాంటి సమస్యలు అన్నింటి గురించి రాబోయే అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఫోన్లు, టీవీలు చూడటం బంద్ చేయాలని, పొద్దున్నే లేచి మంచిగా చదువుకోవాలని, మంచి ర్యాంకులు సాధించి తల్లితండ్రుల పేర్లను, ఉపాధ్యాయుల పేర్లను, సిద్దిపేట పేరును నిలబెట్టాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ నివేదికను సమర్పించారు. అనంతరం ప్రాజెక్టులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, ప్రజాప్రతినిధులు, నాయకులు మోయిజ్, వజీర్, మల్లికార్జున్, సాయిరాం, ఎంఈఓలు పాల్గొన్నారు.
పిల్లల ఆలోచనలకు రూపం ‘సైన్స్ ఫెయిర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



