– కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు విజయవంతం చేయండి
– సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ నేత కెచ్చల రంగారెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంబురాలు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం ఏమిటని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ నేత కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ ఆద్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 న తలపెట్టిన కలెక్టరేట్ వద్ద ధర్నా కి సంబంధించిన ముద్రించిన కరపత్రాలను స్థానిక మాస్ లైన్ కార్యాలయంలో శనివారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సంబురాలు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తలపెట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు హామీతో పాటు,అనేక వాగ్దానాలు చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే డిసెంబర్ 9 న సంబరాలు జరుపుకోబోతున్నదని, సంబరాలు అంబరాన్ని తాకొచ్చేమో కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదని,ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీ లు అమలు కాలేదని, గ్యారంటీలకు వారంటు లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.ఇందిరమ్మ ఇండ్లు, ఆడ బిడ్డలకు రూ. 2500 లు, వృద్ధాప్య,వితంతువుల ఫించన్ లు రూ. 4000 లు కు పెంపుదల,వికలాంగుల రూ.3 వేల నుండి రూ.6 వేల పెంపు, రైతు రుణాల రద్దు,ఆటో కార్మికులకు,వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల జీవన భృతి,నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి,పంటలకు బోనస్ సకాలంలో చెల్లించడం ఇవన్నీ అమలుకు నోచుకోలేదన్నారు.
అకాల వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు తడిసి పోయాయని, అసలే దిగుబడి తక్కువ,పైగా పత్తిని సీసీఐ కొనుగోలు చేయడానికి రైతులను ముప్పుతిప్పలు పెడుతుందని, పత్తి నల్ల బడిందని,తేమ శాతం ఎక్కువ వుందని కొనుగోలు నిరాకరిస్తున్నారని, ఇదంతా రైతును మార్కెట్లో తక్కువగా అమ్ముకునేలా చేయడానికేనని, ఆ తరువాత సీసీఐ అధికారులు దళారుల తో కుమ్మక్కై భాగం పంచుకుంటారని,సీసీఐ కొనుగోళ్ళు ఆలస్యంగా ఆరంభించడ మే అన్యాయమని, పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షల కు తలొగ్గి మన మార్కెట్లోకి అమెరికా పత్తి దిగుమతులపై వున్న 11 శాతం సుంకాలను డిసెంబర్ వరకు ఎత్తి వేసిందని, మన పత్తికి రేటు రాకుండా చేసి, అమెరికా పత్తిని దిగుమతి చేసుకోవడం రైతాంగానికి |ద్రోహం చేయడమేనన్నారు.
అలానే తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,నిర్మాణంలో వున్న వాటి బిల్లులను సకాలంలో అందించాలని, వికలాంగులకు రూ. 3 వేల నుండి రూ. 6 వేలకు పెంచాలని,వృద్ధాప్య పెన్షన్లు, వితంతువులకు, ఒంటరి మహిళల పెన్షన్లను రూ.2 వేల నుండి రూ.4 వేల కు పెంచాలని, అర్హులైన కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే మంజూరు చేయాలని ఇంకా అనేక డిమాండ్లతో ఈనెల 24 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్,సత్యం,గంగ,వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.



